- ప్రయివేటులో బిల్లులు కట్టలేక పేదోళ్లు ఇబ్బందిపడుతుండ్రూ…
- సిఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావును కోరిన జగ్గారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర: కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్న పేదలు దవాఖానల యజమానులు వేసే బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారనీ, ఆరోగ్యశ్రీ పథకంపై ఇకనైనా సిఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శనివారమిక్కడ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ…పేదవారు కార్పొరేట్ హాస్పిటల్స్‌లలో బిల్లులు కట్టలేక ఇబ్బందిపడుతున్నారనీ, ప్రయివేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీని పూర్తిగా అమలు చేయాలన్నారు. కార్పొరేట్ దవాఖానలలో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, ఆరోగ్యశ్రీ మీద సిఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారన్నారు. ప్రతి మనిషినీ బతికించే ఆలోచన ప్రభుత్వం చేయాలనీ, పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం వల్ల అనేక కుటుంబాలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందిపడుతున్నారన్నారు.
ప్రయివేట్ దవాఖానల్లో 10 లక్షల రూపాయల బిల్లులైతే ముఖ్యమంత్రి సహాయ నిధి(సిఎంఆర్ఎఫ్)కింద కేవలం 30వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలయ్యేదనీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో 10లక్షల రూపాయల బిల్లులకు సిఎంఆర్ఎఫ్ కింద 8లక్షల వరకు వచ్చేదనీ, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటి పరిస్థితి లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారనీ, ఆ తర్వాత వచ్చిన సిఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశ్రీ సమర్ధవంతంగా అమలు చేశారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోగ్యవ్రీ పథకం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యే విధగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇంటిలిజెన్స్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని సిఎం దృష్టికి తీసుకెళ్లే వారనీ, ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సిఎం దృష్టికి తీసుకెళ్లిన సందర్భం ఏమైనా ఉందా…?అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ వ్యవస్థ అంతా ఏ లీడర్ ఎక్కడ పడుకున్నాడు..ఏం చేస్తున్నారు? అనే పనిలోనే పడ్డారన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలయ్యేలా చూడాలనీ, పేదలకు ఉపయోగకంగా ఉండే ఆరోగ్యశ్రీ అమలుపై సిఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టిని పెట్టి అమలు చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి ఆ ప్రకటనలో కోరారు.