శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వివి నగర్ గీతాంజలి ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులచే నిర్వహించబడిన “సోషల్ కాజ్ డ్రైవ్ టు ఇంప్రూవ్ ది నైబర్ హుడ్” అనే కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ప్లాస్టిక్ వాడడం వల్ల మనుషులకు, జంతువులకు, పక్షులకు మరియు మొత్తం భూమికి ఎంతగా హాని కలిగిస్తున్నామో వివరించే విధంగా విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ఎల్లమ్మబండలో ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిత్య జీవితంలో భాగమైపోయిందని, బకెట్లు, డబ్బాలు, సంచులు, ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది అన్నారు. అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదమని, పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని అన్నారు. ప్లాస్టిక్ సంచులను జంతువులు తిని అనారోగ్యాల బారిన పడుతున్నాయని, ప్రతి ఏడాది కొన్ని లక్షల పక్షులు, సముద్ర జీవులు కేవలం ప్లాస్టిక్ సంచుల వల్లే చనిపోతున్నాయి అన్నారు. నిషేధం ఉన్న గాని ఈ ప్లాస్టిక్ సంచుల వాడకం ఎక్కువగానే ఉంది కాబట్టి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించిన గీతాంజలి స్కూల్ సిబ్బందిని అభినందించారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, మాజీ అధ్యక్షులు పాండుగౌడ్ మరియు జిల్లాగణేష్, శివరాజ్ గౌడ్, ఉమేష్, సంతోష్ బిరాదర్, పద్మయ్య, గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ ఖురతుల్ ఏన్ సయ్యద, సిబ్బంది శైలజ, గీత, ప్రసన్న, సుమ, మోనిష్ రెడ్డి, శ్రీసమన్విత తదితరులు పాల్గొన్నారు.