బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట

ఉచిత బస్సు, గ్యాస్‌, విద్యుత్‌ పథకాలకు నిధులు
మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. అధికారంలోకి వొచ్చిన కొన్నాళ్లకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్లు వంటి పథకాలను ప్రారంభించిన సర్కారు.. తాజా బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించింది. ఆరు గ్యారంటీల్లో మరికొన్ని పథకాలనూ ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర నుంచి ఊరట కల్పించేందుకు మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం వల్ల ఇప్పటి వరకు 39,57,637 కుటుంబాలకు లబ్ది చేకూరిందని, ఇందుకు రూ.200 కోట్లను ప్రభుత్వం వెచ్చిందన్నారు.

ఈ బడ్జెట్‌లో గ్యాస్‌ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. మహిళను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి అని, మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్‌టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రయాణించే దూరంపైన, ప్రయాణించే పర్యాయాలపైన ఎటువంటి పరిమితీ విధించలేదని చెప్పారు. ఇప్పటి వరకు 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారని, పర్యవసానంగా మహిళలకు రూ.2,351 కోట్లు ఆదా అయ్యిందన్నారు. ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తోందని, దీనివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్‌ డాలర్‌ కార్పొరేషన్‌గా అవతరించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తన బ్జడెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ని వినియోగించుకొనే గృహాలకు ఉచిత విద్యుత్‌ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజాపాలన`ప్రజా సేవ కేంద్రాల ద్వారా వచ్చిన ధరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికి ఈ ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు డిస్కంలు సున్నా బిల్లులు జారీ చేస్తున్నాయని, ప్రభుత్వం ఆ బిల్లుల మొత్తం ఛార్జీలను డిస్కంలకు చెల్లిస్తుందని చెప్పారు. జులై 15 నాటికి 45,81,676 ఇళ్లల్లో వెలుగుల జిలుగులు నింపగా.. జూన్‌ వరకు అందించిన విద్యుత్తుకుగానూ డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.583.05 కోట్లు చెల్లించిందని అన్నారు.

ఈ బ్జడెట్‌లో ఉచిత విద్యుత్‌కు రూ.2,418 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రధాన కర్తవ్యమని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమ ప్రభుత్వం ’ఇందిరమ్మ ఇళ్లు’ నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ పథకం కింద పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ.6 లక్షలు చెల్లిస్తామన్నారు. 2024`25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించామని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తామన్నారు. పూర్తికాని వాటిని సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించి అర్హులకు అందజేస్తామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదని, తమ ప్రభుత్వం 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటి వరకు రూ.10,556 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. అర్హులైన రైతులకు మాత్రమే లబ్ది చేకూరేలా రైతుబంధు పథకం స్థానే రైతు భరోసాను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. దీని అమలుకు విధివిధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఇప్పటికే పలువురి అభిప్రాయాలను సేకరించిందని, వాటిని సభలో సభ్యులందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page