- కాంగ్రెస్, బిఆర్ఎస్లకు వేస్తే కటుంబ సిఎం
- హుజూరాబాద్‌లో ఈటలను భారీ మెజార్టీతో గెలిపించాలి
- హుజురాబాద్, కరీంనగర్, మంచిర్యాల సభల్లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
హుజురాబాద్/మంచిర్యాల, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వోటు వేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి వోటు వేస్తే బీసీ సీఎం అవుతాడని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మరోమారు ఈటలను భారీ మె.జార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హావిూ ఇచ్చారు. తెలంగాణాకు మోదీ సర్కార్ ఇప్పటి వరకూ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని, తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని ఆ రెండు పార్టీలూ కంకణం కట్టుకున్నాయని అమిత్ షా ఆరోపించారు. ఒవైసీకి భయపడే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణా విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదనీ, బీజేపీ అధికారంలోకి వొచ్చాక విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. పేదల తరుపున మాట్లాడినందుకే సీఎం కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకొని పార్టీ నుంచి బయటకి పంపారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పదం జరిగిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను సీఎం, కేంద్రంలో రాహుల్‌ను పీఎం చేయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తీసివేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి మోదీ అరవై లక్షలు కోట్లు ఇచ్చారని అమిత్ షా వెల్లడిరచారు. ఇక కాంగ్రెస్ పార్టీతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మంచిర్యాల ఆయన రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వోటేస్తే కేసీఆర్‌కు వేసినట్టేనని అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కోనేశాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే మళ్లీ కేసీఆర్ కోనేస్తాడని అన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే రాహుల్ బాబాను ప్రధానిని చేస్తాడని అమిత్ షా ఎద్దేవ చేశారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ ప్రభుత్వం రాదని చెప్పారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భయపడే కేసీఆర్ హైదరాబాద్ విమోచనదినోత్సవం జరపడం లేదన్నారు.కేసీఆర్, కాంగ్రెస్‌లు ఓవైసీ కి భయపడుతున్నారని దెప్పిపోడిశారు. ముస్లింలకు ఇచ్చిన 4శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు. మాదిగల సంక్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందన్నారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మాఫీ చేస్తామని అమిత్ షా ప్రకటించారు.