గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బిజెపి నేతల స్వాగతం
రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన మంత్రి తలసాని
ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు గంటల పర్యటన కోసం శనివారం 11-30 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేటకు వొచ్చారు. మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తమిళిసైతోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , సిఎస్ శాంతికుమారి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల, రఘనందన్ రావు, డీజీపీ, విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధానితోపాటు వారంతా రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రెండు గంటలపాటు జరిగే ఈ సుడిగాలి పర్యటనలో దాదాపు రూ. 12వేల కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అధికారిక కార్యక్రమాలు అయినా మోదీకి స్వాగతం పలికేందుకు కానీ, కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కానీ సిఎం రాలేదు. అయితే అధికారిక కార్యక్రమం కావడంతో, సీఎం కేసీఆర్‌కు పీఎంవో నుంచి ఆహ్వానం అందింది కూడా. ఏడు నిమిషాల పాటు కేసీఆర్‌కు మాట్లాడే సమయం కూడా ఇచ్చారు. అయినా సీఎం కేసీఆర్ వెళ్లలేదు. గతంలోనూ ప్రధాని మోదీ పర్యటనలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
చెన్నైలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
స్వాగతం పలికిన సిఎం స్టాలిన్ సహా రాష్ట్ర మంత్రులు
చెన్నైలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
స్వాగతం పలికిన సిఎం స్టాలిన్ సహా రాష్ట్ర మంత్రులు
చెన్నై, ఏప్రిల్ 8 : సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రతిష్టాత్మక వందే భారత్ఎక్స్ప్రెస్ ప్రారంభం, ఇతర కార్యక్రమాలు ముగించుకుని షెడ్యూల్ ప్రకారం భాగ్యనగరం నుంచి తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి మోదీకి ఆహ్వానం పలికారు. అంతేకాదు శాలువా కప్పి మరీ సాదరస్వాగతం చెప్పారు. గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు ప్రధానికి స్వాగతం పలిన వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. సీఎం స్టాలిన్ నాయకత్వం వహిస్తున్న డీఎంకే పార్టీ కూడా బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా పంథాను కొనసాగిస్తుంది. కాంగ్రెస్‌తో చెలిమి చేస్తున్న ఈ పార్టీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ఘాటు విమర్శలు చేసింది. సీఎం స్టాలిన్ సైతం ప్రత్యక్షంగా ఎన్నోసార్లు మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడినప్పుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నీ బీజేపీ-డీఎంకే మధ్య తీవ్ర రాజకీయ వైరానికి అద్దం పడుతున్నాయి. అయినప్పటికీ ప్రధాని మోదీ వొచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు సీఎం స్టాలిన్ సంశయించడం లేదు. ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతున్నారు. శనివారం కూడా అదే జరిగింది. ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ ముఖం చాటేయగా.. స్టాలిన్ మాత్రం తన కేబినెట్‌తో కలిసి వెళ్లి మరీ స్వాగతం పలికారు.