బోధన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

బిజెపి బంద్‌ ‌పిలుపుతో ముందస్తుగా నేతల అరెస్ట్
‌శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన ఉద్రిక్తత
ప్రత్యేక బందోబస్తు నిర్వహించిన పోలీసులు

ప్రజాతంత్ర, నిజామాబాద్‌, ‌మార్చి 21 : జిల్లాలోని బోధన్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతో మొదలైన రచ్చతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆదివారం పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్‌ ‌గ్యాస్‌ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సోమవారం బోధన్‌ ‌బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్‌ ‌పిలుపు నేపథ్యంలో బోధన్‌లో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దించారు. ఈ సందర్భంగా సీపీ నాగారాజు మాట్లాడుతూ..బోధన్‌లో ప్రశాంతంగా బంద్‌ ‌కొనసాగిందన్నారు. ఆందోళనకు సంబంధించి 10 మంది అరెస్ట్ ‌చేసినట్లు ఆయన వెల్లడించారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 170 మందిని ముందస్తు అరెస్ట్ ‌చేశామని, బోధన్‌ ‌పట్టణంలో 144 సెక్షన్‌ ‌కొనసాగుతుందని ఆయన వివరించారు. ఆదివారం ఘటనలో అరెస్ట్ అయిన వారిపై నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసు నమోద చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

బోధన్‌ ‌చుట్టూ ప్రత్యేక చెక్‌ ‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామని, స్థానికేతరులకు బోధన్‌లోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సభలకు, సమావేశాలకు బోధన్‌ ‌పట్టణంలోకి ప్రవేశం నిషేధమని, రాజకీయ పార్టీల నేతలు బోధన్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తామన్నారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నా… పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున పట్టణ వాసులు గుమిగూడకుండ పోలీసులు చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. శివాజీ విగ్రహాన్ని నెలకొల్పిన అంబేద్కర్‌ ‌చౌరాస్తాలో ప్రత్యేక పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. అంబేద్కర్‌ ‌చౌరస్తా వద్దకు ఎవరూ రాకుండా రహదారిలో పోలీసులు అడ్డుకుని, వాహనదారులను వెనక్కి తిప్పి పంపుతున్నారు. అంబేద్కర్‌ ‌చౌరస్తాలో వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page