శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 25: బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య కోసం వివేకానంద విద్యా పథకం ద్వారా ఆర్థిక చేయూతను అందించి ఆదుకున్నదన్నారు. ఈ మేరకు శనివారం భాగ్యనగర్ శ్రీ వేద వ్యాస సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు కలగ రాఘవ నేతృత్వంలో బ్రాహ్మణుల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, గౌరీ నోము కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ప్రణీత్ సంస్థల అధినేత కామరాజు నరేంద్ర, మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య, ఆనంద్ సూర్యలతో సహా కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ధూప దీప నైవేద్యం పథకం ద్వారా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలకు పునరుజ్జీవం లభించిందన్నారు. గోపన్‌పల్లిలో రూ.500 కోట్ల విలువైన భూమిని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిమిత్తం ఇచ్చిందని, సొంత నిధులతో భవనాన్ని సైతం నిర్మించిందని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు తమ ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల నిమిత్తం ఆ భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బ్రాహ్మణులందరి ఆశీర్వాదం తమ ప్రభుత్వానికి విశేషంగా ఉన్నట్లు తెలిపారు. కార్తీక సమారాధన ద్వారా బ్రాహ్మణ కుటుంబాలన్ని ఒక వేదికపైకి చేరి ఆధ్యాత్మిక వేడుకలను నిర్వహించుకోవటం ఆనంద దాయకమన్నారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలకు తాను అన్ని విధాలా అండదండగా నిలుస్తానని విప్ గాంధీ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో మూర్తి, సోమయాజులు, శివ, సురేష్ జోషి , వేద వ్యాస సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.