భద్రాచలం ఉనికికి దెబ్బ

  • మూడు పంచాయితీలుగా విభజన
  • గవర్నర్‌ ‌తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం
  • అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ

భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్‌ ‌తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పంచాయితీ రాజ్‌ ‌చట్ట సవరణ బిల్లుగా తిరిగి ప్రవేశ పెట్టారు. దీనిపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉందని వాదించారు. అయితే అక్కడ ప్రజాభిప్రాయం మేరకు జిల్లా కలెక్టర్‌ ‌పంపిన నివేదిక ఆధారంగా గతంలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా భద్రాచలంలో మూడు గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి తీర్మానించిందని మంత్రి తెలిపారు. ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్‌ ‌తిప్పి పంపారని ఈ బిల్లును తిరిగి ఆమోదం కోసం సభ ఏకగ్రీవంగా తీర్మానించి నట్లు మంత్రి సభకు వివరించారు. అనంతరం ఆ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.ఈ సందర్భంగా శాసన సభలో ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు మాట్లాడారు.

భద్రాచలం అటు మున్సిపాలిటీ, ఇటు గ్రామ పంచాయతీ కాకుండా అభివృద్ధికి నోచుకోకుండా ఉండాలనేది కొందరు ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. మున్సిపాలిటీ చేద్దామంటే కేంద్ర చట్టాలు అడ్డం వస్తున్నాయని, పంచాయతీ చేద్దామంటే ఇక్కడ కొంతమంది అడ్డుపడుతున్నారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలాన్ని గ్రామపంచాయతీ చేసి అభివృద్ధిలో అన్ని గ్రామాల వలే పరుగులు పెట్టిద్దామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయం తీసుకున్నారన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో బిల్లుపెట్టి గ్రామపంచాయతీ చేయాలని నిర్ణయించామని,  భద్రాచలం పరిధిలో 51 వేలకు పైగా జనాభా ఉండటం వలన పరిపాలన సౌలభ్యం కోసం 3 గ్రామ పంచాయతీలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని, కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారి గవర్నర్‌ ‌తమిళి సైకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ బిల్లు ఆమోదించకుండా ఆటంకం కల్పించారని ఎర్రబెల్లి దుయ్యబట్టారు.

గవర్నర్‌ ‌కూడా కాంగ్రెస్‌, ‌బిజేపి వారు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని తీసుకొని ఈ బిల్లు ఆమోదించలేదని, ప్రభుత్వాన్ని సమాచారాన్ని అడిగి ఉంటే బాగుండేదన్నారు.  భద్రాచలం ఎన్నికైన ప్రజా ప్రాతినిధ్యం లేక అభివృద్ధికి నోచుకోవడం లేదని,  గ్రామపంచాయతీ తీర్మానం లేదు. లోకల్‌ ఎమ్మెల్యే అనుమతి లేదని అనడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. మొత్తం అసెంబ్లీలో శాసనసభ్యులు తీర్మానం చేసిన లోకల్‌ ‌శాసన సభ్యుని అనుమతి లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మంగపేటలాంటి గ్రామాలు 20, 30 ఏళ్ల నుండి ప్రజా ప్రాతినిధ్యం లేకుండా ఎంత వెనుకబడి ఉన్నాయని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు చట్టానికి విరుద్ధంగా 6 మండలాలను ఆంధ్రాలో కలపడం వల్ల ప్రజలు వరదల్లో ప్రాణాలు కోల్పోయారని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి ప్రభుత్వం కరకట్ట నిర్మించలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ‌దిగాలంటే ఆంధ్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకం చేసి ప్రజల అభివృద్ధిని ఆపవద్దని కోరుకుంటున్నానని సభకు ఎర్రబెల్లి తెలిపారు. అభివృద్ధి కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా విభజిస్తున్న బిల్లును పున:పరిశీలించగలరని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page