భారత యూనియన్లో విలీనానికి నైజాం విముఖత వైనం

సెప్టెంబర్‌ 13 న సైనిక చర్య నేపథ్యం

దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే… సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం సదరు పాలకులకే ఇచ్చారు. ఫలితంగా… మూడు సంస్థానాలు  ఇండియాలో కలవలేదు. అవి కాశ్మీర్‌, జునాఘడ్‌, హైదరాబాద్‌ (నైజాం). ఆ పరిస్థితుల్లో  ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌… ప్రత్యేక శ్రద్ధ పెట్టి… జునాఘడ్‌ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు. నైజాం నవాబ్‌ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ… మారణ కాండకు తెగబడ్డారు. స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ… తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు.
పొట్ట కూటికోసం వర్తక వ్యాపారాలకై వచ్చిన శ్వేత జాతీయులు, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో సమస్త భారతావనిని అంతర్భాగం చేసుకోగా, ఎన్నో సుదీర్ఘ  పోరా టాలు, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సాధించినా, నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ ప్రాంతం స్వతంత్రం కావడానికి సంవత్సరంకు పైగా సమయం పట్టింది. 1724-1948 మధ్యకాలం 224 సంవత్సరాల పాటు 8 తెలంగాణ జిల్లాలు, 5 మరట్వాడా జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలతో కలిపి 16 జిల్లాల హైదరాబాద్‌ రాష్ట్రం మూడు భాషలతో కొనసాగింది.  హైదరాబాద్‌ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరిపాలనా చివరి అంకంలో ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్ల దళాల దురాగతాలు సహించరాని వైనాయి. ఉద్యమ కారులను గురి చేసిన క్రూరాతిక్రూర అమానుష చిత్రహింసలకు హద్దులు లేకుండా పోయాయి. 90 రకాల పన్నుల విధింపే కాకుండా తమ పలుకు బడిలోని  ప్రజలను బానిసలుగా చూస్తూ , వెట్టి చాకిరీలు చేయించు కున్నారు . ప్రజల సొమ్ముతో జల్సాలు చేసు కున్నారు. ఎదిరిస్తే  కాల్చి చంపారు. మత మార్పిడులు బలవంతంగా చేశారు. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయలను అణచి వేశారు.
 స్థానీయ భాషలను, అనాదిగా ఉన్న  సంప్రదాయాలను హీనంగా చూశారంటే  తెలుగు వారి దుర్గతి స్పష్టమవుతుంది. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో ఆర్యసమాజ్‌,కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు, కవులు, రచయితలు తమతమ పాత్రలు నిర్వహించి, నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యానికి నల్గొండలో పురుడు పోసుకున్న నిజాం వ్యతిరేక పోరాటం రాజ్యం అంతటా విస్తరించింది. రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలా దేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, దాశరథి, షోయబుల్లా ఖాన్‌, అనభేరి ప్రభాకర్‌ రావు, జమలాపురం కేశవరావు, లక్ష్మీనర్సయ్య, బద్ధం ఎల్లారెడ్డి, మగ్ధూం మొహియుద్దీన్‌,  దొడ్డి కొమురయ్య, కోదాడ నారాయణరావు , బెల్లం నాగయ్య, సింగిరెడ్డి భూపతిరెడ్డి, రాంజీగోండు, కొమురం భీం, రఘునాధరావు కాచే, అలుగు వీరమ్మ, కిషన్‌ మోదాని, లక్క కిష్టయ్య, బత్తిని మొగిలయ్య, కాటం లక్ష్మీ నారాయణ, మర్రి చెన్నారెడ్డి, వందేమాతరం రాంచందర్‌ రావు , కర్నె వెంకట కేశవులు ఒక్కరేమిటి… వివిధ పోరాట మార్గాలలో, ఎందరో త్యాగధనులు తమతమ పాత్రలను పోషించి, ప్రాణాలను ఫణంగా పెట్టారు.
నారాయణరావు పవార్‌, శంశా బాద్‌ గంగారామ్‌ తో కలిసి  ఏకంగా నిజాం పైనే బాంబులు విసిరి సంచలనం సృష్టించారు. దాశరథి కారాగారంలో గోడలపై నిజాం వ్యతిరేక కవితలు రాశారు. కాళోజి, సుద్దాల హనుమంతు, యాదగిరి లక్ష్మీనా రాయణ లాంటి వారు జన బాహుళ్య కవితలల్లారు. ఇలా నిజాం వ్యతిరేక పోరాటాలు వివిధ రూపాల్లో ఉద్ధృతం అయిన వేళ. . .రజాకార్ల ఆగడాలు, భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాం అంగీకరించలేదు. రజాకార్ల ఆగడాలు మితిమీరి పోయాయి. మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం సాగుతోంది. హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రంగా నైనా , లేక పాకిస్తాన్లో అంతర్భాగంగా నైనా ఉండాలని నిజాం ప్రయత్నిస్తూ, ఐక్య రాజ్య సమితికి నిజాం, భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతలను సైతం పంపాడు. పోరాటానికి దేశాల నుండి ఆయుధ సంపత్తిని పొందే కృషి సల్పారు. 1946 – 1948ల మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి రంగంలోకి దిగడం దానివల్లనే జరిగింది.
యథాతథ స్థితికి ఒప్పందం…
వాస్తవ పరిస్థితిని నిజాం రాజుకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్‌ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. నవాబు స్వయంగా ఢల్లీికి వెళ్లి సర్దార్‌ పటేల్‌ను కలిసి, 1947 నవంబర్‌ 29వ యధాతథ ఒప్పందంపై మౌంట్‌బాటన్‌ నిజాం నవాబు సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్‌ తరపున ఏజంట్‌ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. అయినా నైజాం, ఆయన నియమిత సైన్యం ఆగడాలు ఆగలేదు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురు తిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు… అందరూ తమ ప్రాణాలు ఫణంగా పెట్టారు. ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన స్థితిలో,  కేంద్ర ప్రభుత్వం నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి సూచించగా, ఈ క్రమంలోనే ‘‘ఆపరేషన్‌ పోలో,’’  పేరుతో నాటి భారత హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్‌ పటేల్‌ నేతృత్వంలో ‘‘ పోలీసు చర్య’’ చేపట్టడం జరిగింది. జనరల్‌ జె. ఎన్‌. చౌదరి నాయకత్వంలో 1948 సెప్టెంబర్‌ 13 న సైనిక చర్య ప్రారంభమైంది.
భారత సైన్యం విడివడి విజయవాడ, బీదర్‌ వైపుల నుండి నలు వైపులా ముట్టడికి ముందుకు సాగాయి. ఓటమిని తప్పించుకో లేని నిజాం, దిక్కు తోచక, లేక్‌ వ్యూ అతిథి గృహంలో  ఉన్న భారత ఏజెంట్‌ మున్షీని కలిసి, లొంగు బాటు నిర్ణయాన్ని ప్రకటించాడు. బొల్లారం వద్ద నిజాం, సర్దార్‌ పటేల్‌ ముందు తలవంచి, లోంగి పోవడంతో,  సైనిక చర్య సెప్టెంబర్‌ 17 న సఫలీకృతమైంది. తద్వారా హైదరాబాద్‌ రాజ్యం, భారత యూనియన్లో విలీనమైంది. నిజాం ప్రధాన మంత్రి లాయక్‌ అలీని తొలగించి, ఖాన్‌ రజ్వీని ఖైదు చేశారు. తర్వాత లాయక్‌, రజ్వీ పాకిస్తాన్‌ పారి పోయారు.  శాసన సభ రద్దు చేయబడి సెప్టెంబర్‌ 18న సైనిక చర్యను సఫలం చేసిన జే. ఎన్‌. చౌదరి, సైనిక గవర్నర్‌ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎం. కె. వెల్లోడి ముఖ్యమంత్రి గా, నియుక్తు లైనారు. 1956 ఏప్రిల్‌ 1న  నిజాంకు , భారత ప్రభుత్వానికి ఒప్పందం కుదిరి, నిజాంకు ఏడాదికి పన్నులు లేకుండా, యాభై లక్షల రూపాయల భరణం చెల్లింపు కు, ప్రపంచంలో నిజాం ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్‌ పూర్వపు రాజుగా బిరుదులు కొనసాగింప బడేందుకు, ప్రభుత్వం అంగీకరించింది. అలా 1956 అక్టోబర్‌ 31 వరకు నిజాం రాజ్‌ ప్రముఖ్‌ గా కొనసాగారు.
` రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page