వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో బంధించుకుంది. గాంధారి వివాహం ధృతరాష్ట్రునితో జరిగింది. గాంధారి, అందరి ఆదరాభిమానాలనూ, ప్రజా గౌరవాన్ని పొందింది.
కుంతీదేవి శూరసేనుని ఇంటబుట్టిన కుంతిభోజుని దత్తపుత్రిగా వెళ్ళింది. అక్కడ అల్లారుముద్దుగా సకల సౌభాగ్యాలతో పెరిగింది.ఒకనాడు దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. కుంతీదేవి మహార్షిని భక్తి శ్రద్ధలతో సేవింపగా మహిర్షి ఆమెకు వరాన్ని అనుగ్రహించాడు. మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్ర మహిమను పరీక్షించాలనుకుని సూర్యుణ్ణి ప్రార్థించింది. ఆ కర్మసాక్షి ప్రత్యక్షమైనాడు. కుంతికి సద్యోగర్భాన పుత్రుణ్ణి అనుగ్రహించాడు. అతడే కర్ణుడు. కుంతి ఆ కుమారుణ్ణి తొట్టిలో పెట్టి నదిలో వదిలివేసింది. ఆ తొట్టి కొట్టుకుపోయి అతిరధుడనే ఒక రధసారథికి దొరికింది. అతగాడు కౌరవుల వద్ద పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు రాధ. అందుకే కర్ణుడికి రాధేయుడనే పేరువచ్చింది.
సూర్యుడి వరం వలన కుంతీ దేవికి కన్యాత్వం చెడలేదు. నవయవ్వనాంగియై ఎంతో అందంగానూ, ఆకర్షణీయంగానూ తయారైనది. ఆమెకు వివాహం చేయాలని కుంతిభోజుడు స్వయంవరం ప్రకటించాడు. కుంతి పాండురాజుని ఇష్టపడింది. వారి వివాహం జరిగింది. ఆనాడు రాజవంశీయులో మద్రదేశాధీశులు బాగా పేరుగాంచినవారు. మద్రదేశాధిపతి శల్యుడు. ఆయన సోదరి మాద్రి. ఆమె గుణరూప శీలవంతురాలు. భీష్ముడు ఆమెను కూడా పాండురాజు కిచ్చి వివాహం చేయాలనుకుని శల్యుడితో అంటే అతగాడు ఎంతో ఆనందించాడు. కానీ వారి వంశానుసారంగా కన్యాశుల్కం చెల్లించి తన సోదరిని తీసుకునివెళ్ళమన్నాడు. గాంగేయుడు సువర్ణ రత్నాభరణాలు చెల్లించి మాద్రిని తెచ్చి పాండురాజుకిచ్చి వివాహం జరిపించాడు. పాండురాజు భార్య లిద్దరితోనూ ధర్మమార్గంలో ప్రజారంజకంగా రాజ్యపాలన గావిస్తున్నాడు. పాండురాజు భీష్ముని అనుమతితో దిగ్విజయ యాత్రకు బయలుదేరి వెళ్ళాడు. నానాదేశాధీశులను జయించి తిరిగివచ్చి, తాను తెచ్చిన ధనకనక రాసులను గాంగేయుడి ముందుంచి ఆయన ఆశీస్సులనందుకున్నాడు. భూషణాలను తల్లికి కూడా సమర్పించుకున్నాడు.
అన్న గారిచేత నూరు అశ్వమేధ యాగాలను చేయించాడు. ప్రజలందరూ ఎంతో ఆనందపడ్డారు.
(తరువాయి..వొచ్చే సంచికలో)