- నేడు ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం
- చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలు..
ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది. చాలా మంది బిజీ లైఫ్ పేరిట మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రపంచ మానవతా దినోత్సవం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవతా ప్రయత్నాలను గౌరవించేందుకు..సంక్షోభంలో ఉన్న ప్రజలకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనను ప్రచారం చేసేందుకు సమాయత్తం అయ్యింది. ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడంలో వారి నిరంతర సహకారాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉంది.
మానవతా దినోత్సవాన్ని ఎప్పుడు ప్రకటించారంటే..
2003లో ఇరాక్ దేశంలోని బాగ్దాద్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అప్పటి సెక్రెటరీ జనరల్ ఇరాక్ ప్రత్యేక ప్రతినిధి సెర్గియో వియర డి మెల్లోతో సహా 21 మంది వారి అనుచరులు అక్కడికక్కడే మృతి చెందారు. అందుకు గుర్తుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 19న ప్రపంచ మానవత్వ దినోత్సవంగా ప్రకటించారు. మానవతా సిబ్బందిని గుర్తించేందుకు, మానవీయ కారణాల కోసం తమ ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిచ్చే ప్రత్యేకమైన రోజు ఈరోజు. ఇది ప్రపంచం మొత్తం మానవత్వ కృషికి స్ఫూర్తినిచ్చే అవకాశముంది.
అసహనం అల్లకల్లోలానికి కారణం
మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. అదే మనిషిలోని అసహనం అల్లకల్లోలానికి కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సాగించేందుకు సహనం తప్పనసరి. అదే మానవత్వపు ఉత్తమ లక్షణం. మానవతావాదంలో ప్రేమకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యరశ్మిలా మలయమారుతంలా ప్రేమానుభావం మానవ లోకాన్ని అలముకోవాలి. హ్యూమన్ మ్యూచువల్ కో ఆపరేషన్, అవగాహన నుంచి వచ్చేదే ప్రేమ. ఇదే మనిషి ఆటవిక ప్రవృత్తిని నాశనం చేసి, స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది.
మానవతా వాదంతో ఐక్యత..
మానవతావాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. ఇది స్వేచ్ఛ, జ్ఞానం, నీతి కోసం హేతువు, ఐక్యత తప్పకుండా ఉండాలి. ఐక్యత వల్ల కూడా సహనం కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మందిలో ఐక్యత కొరవడింది. ప్రతి దానికి స్వార్థం పెరిగిపోయింది. డబ్బుతోనే ప్రతిదాన్ని ముడిపెడుతున్నారు. డబ్బే సర్వస్వం కాదని అందరూ గుర్తుంచుకోవాలి. దేవుడు కనిపిస్తే దణ్ణం పెట్టకపోయినా పర్వాలేదు కానీ, పేదవాడు కనిపిస్తే కాస్త అన్నం పెట్టండి. అదే మనకు పుణ్యం. సహాయం చేయడానికి ఉండవలసింది డబ్బు కాదు. మంచి మనసు. ప్రతి మనిషిలోను దేవుడు ఉంటారు. అది మనం చేసే పనుల్లో ప్రస్ఫుటమౌతారు. సేవ, సాయం, ఇవే భగవంతుని ప్రేమకు నిదర్శనాలు. మానవత్వానికి ఆదర్శాలు..మానవత్వం అంటే సాయం చేయడమో.. దానం చేయడమో కాదు.
సరైన సమయంలో సరైన రీతిలో స్పందించే గుణం. ఇతరులను బాధపెట్టకుండా ప్రవర్తించడం. ఇది అందర్లోనూ ఉండే సహజ స్వభావమే. కానీ నేడు అది కొరవడుతోంది. ఏదైనా చేయాలంటే అలసత్వం. మనకెందుకులే అనే నిర్లక్ష్యం. లాభనష్టాలు బేరీజు వేసుకునేంత స్వార్థం మనుషుల్లో పెరుగుతోంది. ఇకనైనా మేల్కొందాం. మానవత్వంతో ముందడుగేద్దాం!. అందుకు స్ఫూర్తిగా నిలుస్తోన్న ఎంతోమంది మానవత్వం పరిమళించే మంచి మనుషులకు, సేవామూర్తులకు వందనం..అభివందనం.
– కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్
ప్రజాతంత్ర, జగిత్యాల, 9010128884