- పంట నష్టపోయిన వారికి 15వేలు పరిహారం ఇవ్వాలి
- సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి ఎకరాకు రూ.15వేల చొప్పున పరిహారం చెల్లించాలని రేవంత్ అందులో పేర్కొన్నారు. కొత్తగా పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరదలు, అకాల వర్షాలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నా వారిని ఆదుకునే పథకమేదీ ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్నదాతల పట్ల కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి తప్పుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పథకాల ద్వారా వారిని ఆదుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.