కెసిఆర్‌ను ఈ రెండు స్థానాల్లో గెలువనీయవద్దని కాంగ్రెస్, బిజెపిలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ రెండు నియోజవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. కామారెడ్డిలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై పోటీకి దిగడం మరింత ఆసక్తిని రేకిస్తున్న అంశం. కాగా అటు గజ్వెల్లో భారతీయ జనతాపార్టీ చేర్పుల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ను అభ్యర్ధిగా నిలబెట్టింది. వీరిద్దరుకూడా కెసిఆర్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నవారే కాదు, ద్వేషిస్తున్నవారు కావడంతో రేపు ఇక్కడ జరుగబోయే ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ముగ్గురుపైనే యావత్ దేశం దృష్టిసారిస్తున్నది. మూడు రాజకీయ పార్టీలకు చెందిన ఈ ముగ్గురు ఆయా పార్టీలు మెజార్టీ స్థానాలను సాధించుకున్న పక్షంలో వీరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నవారు కావడం విశేషం. రెండు నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ఈ ముగ్గురు కూడా ఆయా నియోజకవర్గాలకు కొత్తవారే కాకుండా, ప్రాంతేతరులు కూడా. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం గజ్వెల్‌కు పాతవాడే, ఆయన అక్కడ సిట్టింగ్ ఎంఎల్ఏ, కాగా, కామారెడ్డి నియోజకవర్గం నుండి కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అయితే ఎట్టిపరిస్థితిలో కెసిఆర్‌ను ఈ రెండు స్థానాల్లో గెలువనీయవద్దని కాంగ్రెస్, బిజెపిలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ రెండు నియోజవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. కామారెడ్డిలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై పోటీకి దిగడం మరింత ఆసక్తిని రేకిస్తున్న అంశం. కాగా అటు గజ్వెల్లో భారతీయ జనతాపార్టీ చేర్పుల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ను అభ్యర్ధిగా నిలబెట్టింది.
వీరిద్దరుకూడా కెసిఆర్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నవారే కాదు, ద్వేషిస్తున్నవారు కావడంతో రేపు ఇక్కడ జరుగబోయే ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. మరో విచిత్రకర విషయమేమంటే ఈ ముగ్గురు కూడా రెండేసి స్థానాల్లో పోటీచేయడం. కామారెడ్డిలో కెసిఆర్‌ను ఢీ కొడుతున్న రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనూ, గజ్వెల్లో పోటీ పడుతున్న ఈటల రాజేందర్ తన సొంత• నియోజకవర్గమైన హుజురాబాద్‌లో కూడా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకుంటూనే కెసిఆర్ ఓటమికి ప్రణాళికలు రచిస్తున్నారు. గజ్వెల్నుండి కెసిఆర్ మూడవసారి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో, ఆ తర్వాత 2018లో ఆయన ఇక్కడినుండే పోటీచేసి విజయం సాధించారు. ఇక్కడ ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యారు. 2018లో కెసిఆర్ తన సమీప ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్రెడ్డిపైన 55 వేల వోట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈసారి మాత్రం కెసిఆర్ గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొస్తున్నది. ఎందుకంటే నిన్నటివరకు తనకు అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ ఉద్యమంలో కుడిభుజంగా పనిచేసిన ఈటలతో నువ్వా, నేనా స్థాయిలో పోటీపడాల్సి వొస్తున్నది. బిఆర్ఎస్ పార్టీనుంచి తనను అన్యాయంగా బహిష్కరించాడన్న కోపం ఇంకా ఈటలలో ్ల రగులుతోంది. అదేవిషయాన్ని ఆయన తన ప్రచారంలో కూడా ప్రజలకు చెప్పే ప్రయత్న చేస్తున్నాడు. తాను కేవలం కెసిఆర్ ఓటమిని చూడాలనే ఉద్దేశ్యంగానే గజ్వెల్‌కు వొచ్చినట్లు చెబుతున్నాడు. కెసిఆర్లాగానే తనకు కూడా ఇంతవరకు ఏ ఎన్నికల్లో ఓటమి ఎరుగని రికార్డు ఉందంటున్న ఈటల, హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు హరీష్‌రావు, కెసిఆర్ వందల కోట్లు ఖర్చుచేసినా అక్కడి ప్రజలు తనను ఆశీర్వదించారంటున్నారు.
ఈ ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని, కాబోయే ముఖ్యమంత్రి తానేనని బహిరంగంగానే చెబుతున్నాడు. కాగా కాంగ్రెస్‌నుండి మాజీ ఎంఎల్ఏ తూంకుంట నర్పారెడ్డి పోటీపడుతుండడంతో ఇక్కడ త్రిముఖపోటీ కొనసాగనుంది. గతంలో గజ్వెల్ ఎంఎల్ఏగా గెలిచిన అనుభవం ఉండడంతో నర్సారెడ్డికూడా ఈసారి గెలుపు తనదేనని నమ్మకంగా చెబుతున్నాడు. వాస్తవంగా గజ్వెల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ గెలిచిన వారి పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వొస్తుందన్న ఓ నమ్మకం ఇక్కడ ప్రజల్లో ఉంది. ఈ నియోజకవర్గంనుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కెసిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ది చేశాడన్న పేరుంది. రెండు విడుతలుగా ఆదుకున్న గజ్వెల్ ప్రజలు ఈసారికూడా కెసిఆర్‌ను గెలిపించి మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారన్న నమ్మకం ఆ పార్టీకుంది.
కాగా కామారెడ్డిలో కెసిఆర్‌తో గట్టిపోటీకి సిద్ధమైన పిసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గంతోపాటు తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన బృహత్ బాధ్యత ఆయన భుజస్కందాలపై పడింది. దీంతో ఆయన కామారెడ్డిపైన ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నాడు. నామినేషన్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బిసి డిక్లరేషన్‌ను విడుదల చేయడం కొత్త ఊపునిచ్చింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తీసుకువొచ్చి ఆయనతో డిక్లరేషన్‌ను విడుదలచేయించడంతోపాటు ప్రచార కార్యక్రమంలో భాగస్వామిని చేయడం కార్యకర్తలకు ఊపునిచ్చింది. కెసిఆర్‌ను ఓడించడమే తనముందున్న ప్రధాన లక్ష్యంగా ఆయన చెప్పుకుంటున్నారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు, వివిధ డిక్లరేషన్లపైన ప్రచారం చేస్తున్నాడు.
కాగా మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న కామారెడ్డి ప్రజలు కెసిఆర్‌పై ఉన్న ఆగ్రహాన్ని నామినేషన్ల రూపంలో వ్యక్తంచేశారు. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెట్లు, మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న వారు అంతా కలిపి దాదాపు 114 మందివరకు నామినేషన్ వేయడం గమనార్హం. వీరిలో చాలామంది గడువులోగా ఉపసంహరించుకోవడం వేరే విషయం. ఇదిలాఉంటే గజ్వెల్ తరహాలో కామారెడ్డి పరిధిలోని పల్లెల రూపురేఖలను మారుస్తానని కెసిఆర్ హామీ ఇస్తున్నారు. ఇక్కడున్న బీడి కార్మికులందరికీ పెన్షన్లను ఇచ్చేబాధ్యత తనదేనన్నారు. కెసిఆర్ వొస్తున్నాడంటే ఒంటరిగా రాడు, కెసిఆర్ వెంట అభివృద్ధి వొస్తుందంటున్నారు. అంటే తనను గెలిపిస్తే ఈ ప్రాంతమెంతో అభివృద్ధిచెందే అవకాశముందన్న విషయాన్ని చెప్పేప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రాంతంతో తనకున్న పేగు బంధాన్ని, ఉద్యమకాలంలో 45 రోజులపాటు ఇక్కడ చేసిన జలసాధన ఉద్యమాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.