కేరళలో జరిగిన నష్టం దేశానికి తీరని విషాదం
వయనాడ్‌లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక
వయనాడ్, ఆగస్ట్ 1 : దేశంలోనే అత్యంత భయంకరమైన విషాద ఘటన వయనాడ్‌లో చోటు చేసుకుందని, ప్రజలు తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని, ఇలాంటి సమయంలో వారిని ఏ విధంగా ఓదార్చాలో తెలియడం లేదని, తన తండ్రి చనిపోయినప్పుడు ఎలా బాధపడ్డానో.. ఈరోజు అలాగే అనిపిస్తుందంటూ గత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన అనంతరం వదిలేసుకున్న లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. గురువారం సోదరి ప్రియాంకతో కలిసి వాయనాడ్‌ను సందర్శించిన రాహుల్ మీడియాతో మాట్లాడుతూ…తన దృష్టిలో ఇది జాతీయ విపత్తు అని, ఈ ఘటనలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, కేరళకు జరిగిన నష్టం దేశానికి తీరని విషాదమని రాహుల్ అన్నారు.
ఇది రాజకీయాలకు సమయం కాదని, బాధితులందరికీ అవసరమైన సాయం అందించడానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నుంచి బాధితులకు రావాల్సిన సాయం అందేవరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఇలాంటి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై సమగ్ర కార్యచరణ ప్రణాళిక అవసరమని రాహుల్ పేర్కొన్నారు. కాగా..వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 290కి పైగా చేరుకుంది. గత మూడు రోజులుగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.