మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శ
రైతు ఆందోళన పట్టించుకోవాలన్న మరో మాజీ మంత్రి సత్యవతి
మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : మూడు విడతల్లో రాష్ట్రంలో 40 శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దీని గురించి అంతా మాఫీ చేశామని ప్రకటనలు చేయడం దారుణమని మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని..రేవంత్‌రెడ్డివి పుటకో మాట మాట్లాడుతాడని అన్నారు. రూ. 49వేల కోట్లని చెప్పి.. 17 కోట్లతో సరిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని అధికార కాంగ్రెస్ మంత్రులే అంటుంటే రేవంత్ రెడ్డికి సిగ్గులేదన్నారు. ఆయనకు అన్ని దేవుళ్ల వి•ద ఒట్లు తప్ప..ప్రజల సంక్షేమం పట్టదని పేర్కొన్నారు. హరీశ్‌రావు సవాల్ భయంతోనే రుణమాఫీ మొదలు పెట్టారన్నారు. ఖమ్మం సభలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందనడం రేవంత్ రెడ్డి తెలివి తక్కువ తనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిమాటికి మాట మార్చి రైతులను మోసం చేస్తుందని విమర్శించారు.
రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్న లక్షలాది మంది రైతులకు అండగా ఉంటామన్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన రైతుకు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తూనే ఉందని, కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హావి•లను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్‌లో వి•డియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీలో అనేక లోపాల వల్ల వారికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.
ఏ గ్రామంలో చూసినా రుణమాఫీ కాని రైతులే ఎక్కువ ఉన్నారని, వారు ప్రతి రోజూ బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలను మాత్రం ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు మాత్రం రైతు రుణ మాఫీ అవుతుందని, రాష్ట్రంలో ఉన్న నిరుపేద రైతులకు మాత్రం ప్రభుత్వం మాఫీ చేయలేదన్నారు. రైతులకు రేషన్, ఆధార్ కార్డు సరిలేదని, ఒకే కుటుంబం అని అనేక రకాలు తప్పులను చూపి రుణాలను మాఫీ చేయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను, మేధావులను ఇబ్బంది పెట్టే భాష వాడడం సరి కాదని, వెంటనే తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఒక స్వర్ణయుగంగా కొనసాగిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.