మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదు

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం
యువతకు శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు
నా దగ్గర చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు…
100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా
మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని, ప్రజా య్రోజనాల దృష్ట్యా స్రీమ్‌లైన్‌ మాత్రమే చేస్తున్నామని సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డా. బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ…మెట్రోకు సంబంధించి  ఎయిర్‌పోర్టుకి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరం తగ్గుంతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బిహెచ్‌ఈఎల్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 32 కిమీ దూరం ఉంటుందని, అట్లా కాకుండా నాగోల్‌ నుంచి ఎల్‌బి నగర్‌ నుంచి పాత బస్తీ ఓఎస్‌ హాస్పిటల్‌ మీదుగా చాంద్రాయణ్‌ గుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్‌కి లింక్‌ చేయనున్నట్లు సిఎం తెలిపారు. మియాపూర్‌ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు… అవసరమైతే మైండ్‌ స్పేస్‌ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సిల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు పొడిగిస్తామని, గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్‌పోర్టుకి మెట్రోకి వెళ్లేవారు దాదాపు ఉండరని చెప్పారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్‌ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని తెలిపారు. ఇక ఫార్మాసిటీని అంచెలంచలుగా రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ప్రత్యేకంగా జీరో కాలుష్యంతో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి అదే ప్రాంతాల్లో గృహనిర్మాణం కూడా ఉంటుందని సీఎం తెలిపారు.కార్మికులు నగరానికి రాకుండా అక్కడే అన్ని ఎర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

యువతకు శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు
యువతకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తల ద్వారా యువతలో ఈ నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని..స్కిల్స్‌ అదనంగా ఉంటాయని చెప్పారు. అక్కడ నుంచి బైటకి వెళ్లేవాళ్లకి క్యాంపస్‌లోనే ఎంపిక ఉంటుందన్నారు. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని తెలిపారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఇక 100 పడకల హాస్పిటల్‌ ఉన్న చోట నర్సింగ్‌ కళాశాల ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్‌ ఇప్పిస్తామని.. ఆయాదేశాలకు అవసరమైన మ్యాన్‌ పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని చెప్పారు. యువతకు వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని..చాలా మంది సీనియర్‌ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

నా దగ్గర చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు…100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా
ఇక మూడు కమిషనరేట్లకు కమిషనర్లను  నియమించానని, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారని, శాఖలకు అధిపతులను నియమించే వరకే  తాను చూస్తానని, వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. అధికారుల నియామాకాల్లో కూడా సామాజిక న్యాం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్‌ లైన్‌ చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇక 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామన్నారు. తనకు దగ్గరనో, బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. తాను ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తానని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తామన్నారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తన దగ్గర చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదని, జర్నలిస్టులకు సంబంధించి అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని..ఇప్పటి నుంచి వందరోజుల్లో పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌ కా నిషాన్‌ నుమాయిష్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : నుమాయిష్‌ హైదరాబాద్‌ కా నిషాన్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అంటే చార్మినార్‌.. ట్యాంక్‌ బండ్‌ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్‌ అని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 83వ నుమాయిష్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం సభనుద్దేశించి ప్రసంగించారు. ప్రతీ ఏటా నుమాయిష్‌ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ కాలేజీని ఇంజనీరింగ్‌ కాలేజీగా అప్‌ గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి  పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక బాధ్యతతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ సొసైటీకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, ఎగ్జిబిషన్‌ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page