- రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
- పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభం
- ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
- టీఆర్ఎస్ పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు…రేవంత్ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్న మంత్రి
పరిగి/కొడంగల్, ప్రజాతంత్ర, జూన్ 16 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ అధికారి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్‌ను మంత్రి సందర్శించారు. హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్న బాలింతలతో వారికి అందుతున్న వైద్య సేవలు, భోజన సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో మరుగుదొడ్లలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్బంగా బాలింతకు మంత్రి కేసిఆర్ కిట్‌ను అందజేశారు. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్‌ను శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డితో కలసి మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు కోటి రూపాయల వ్యయంతో ప్రతి నియోజక వర్గానికి నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
స్థానిక శారదా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కొరకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల శిబిరంలో మంత్రి పాల్గొని యువతకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను విడతల వారిగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కొంత ఆలస్యమైన 95 శాంతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం కృషి చేయడం జరిగిందన్నారు. స్థానిక శాసన సభ్యులు నిరుద్యోగ యువతకు మంచి శిక్షణ, భోజన సదుపాయములు కల్పించడం సంతోషదాయకమన్నారు. గతంలో సిద్దిపేట జిల్లాలో కూడా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందించి 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఉచిత కోచింగ్ ను అందరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొంది తమ తల్లి దండ్రుల ఆశయాలని సాకారం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు మహేష్ రెడ్డి, వికారాబాద్ శాసన సభ్యులు మెతుకు ఆనంద్,జిల్లా కలెక్టర్ నిఖిల, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు…రేవంత్ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్న మంత్రి
టీఆర్ఎస్ పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి రేపోమాపో పాలమూరు ఎత్తిపోతల నీళ్లు తెచ్చి వి• పాదాలు కడుగుతామన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నారు. అయినా పనులు ఆగవని తేల్చిచెప్పారు. త్వరలోనే కొడంగల్‌కు సాగునీరు తీసుకొస్తామని స్పష్టం చేశారు.గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప.. అభివృద్ధి మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. గురువారం కొడంగల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. వికారాబాద్, నారాయణ్‌పేట్ జిల్లాల్లో మొత్తం రూ. 42.34 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందని హరీష్ రావు తెలిపారు.
కోస్గి హాస్పిటల్ని రెండు నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కోరిక మేరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో సదుపాయాలు పెంచి, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామన్నారు. కొడంగల్‌లోనూ డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఇక్కడ తాగునీటి సమస్య ఉండే.. మిషన్ భగీరథతో ఆ సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఎనిమిదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఈ నియోజకవర్గానికి ఒక హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, బస్ డిపో ఎందుకు తేలేకపోయారని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చే అవకాశమే లేదని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఖతం అయిపోయిందన్నారు. ఆ పార్టీది ముగిసిన చరిత్ర అని నిప్పులు చెరిగారు.