మోదీ పర్యటనపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటనపై ఉభయ రాష్ట్రాల్లోకూడా నిరసన గళం వినిపించేందుకు స్థానిక ప్రజలు సిద్ధమవుతున్నారు.. రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ ఆయన రాక పట్ల తీవ్ర నిరసనను వ్యక్తం చేయాలని వారు సిద్ధమవుతున్నారు.. స్వదేశీ అంటూ అధికారంలోకి వొచ్చిన బిజెపి ప్రభుత్వం స్వదేశీలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు రంగానికిచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదన్న ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనను నిలదీయాలని వారు సంకల్పిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో, తెలంగాణలో సింగరేణి విషయమై ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయంపట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ ఉక్కు మా జన్మహక్కు అంటూ ప్రాంతీయ భేదాలు లేకుండా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి, యువజనులంతా ఎంతోకాలంగా ఉద్యమాలు చేసి సంపాదించుకున్న ఈ స్టీల్‌ ‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సుమారు లక్షన్నర మందికి ఉపాధి అవకాశాలను కలిగిస్తున్న ఈ ఫ్యాక్టరీ ఉత్తరాంధ్రకే తలమానికమైనది. సువిశాలమైన ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని దాని చుట్టుపక్కల అనేక చిన్న మధ్య తరహా వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. అవి కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలను చేస్తున్నాయి. అలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్రం సిద్దపడడాన్ని అక్కడి ప్రజలు, ముఖ్యంగా అందులోని వేలాది కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాక్షాత్తు పార్లమెంటులోనే దీనిపై తమ నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మొదటిసారిగా ఈ ఫ్యాక్టరీ నెలకొన్న విశాఖ పట్టణానికి వొస్తున్న మోదీ ముందుగా దీనిపై వివరణ ఇవ్వాలని కార్మికులతోపాటు వివిధ సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. అయితే మోదీ సభకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావొద్దని ఏపి ప్రభుత్వం ఆందోళ చేస్తారని భావిస్తున్న పలువురిని ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నది.

ఇదిలా ఉంటే తెలంగాణలోకూడా ఇదే పరిస్థితి. ఇప్పటికే విభజన హామీలను నెరేవర్చలేదంటూ తెలంగాణ సర్కార్‌ ‌కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. వివిధ బిజెపి పాలిత రాష్ట్రాలను ఒక తీరుగా, ఇతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపట్ల మరో తీరుగా కేంద్రం వ్యవహరిస్తున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కేంద్రంపై దాడిచేస్తున్న విషయం తెలియందికాదు. ఇటీవలకాలంలో ఆ ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకుని కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య తీవ్ర అఘాతం ఏర్పడింది. అది పోనుపోను శృతి మించిపోతున్నది. ఒక వైపు ఇరు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడదోసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కుట్ర చేసిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాక్షాలతోసహా ఎత్తి చూపడం, అదికాస్తా సర్వోన్నత న్యాయస్థానానికి చేరుకోవడం కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మరింత చెడిపోవడానికి కారణంగా మారింది. మరో పక్క రాష్ట్ర గవర్నర్‌ ‌ప్యార)ల్‌ ‌ప్రభుత్వాన్ని నడుపుతున్నదన్న ఆరోపణలున్నాయి.

ఇంకోపక్క నువ్వా అంటే నువ్వా అన్నట్లు మునుగోడు ఎన్నికలు జరుగడం… ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో మోదీ తెలంగాణ టూర్‌ ‌పెట్టుకోవడమన్నది బిజెపి మరో ఎత్తుగడేనన్న వాదన వినిపిస్తున్నది. ఎప్పుడో సంవత్సరం క్రితం ఉత్పత్తిని ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసే ఒంకతో మరోసారి తెలంగాణలో కలకలం లేపేందుకే బిజెపి ఎత్తుగడ వేసిందన్నది టిఆర్‌ఎస్‌ ‌వర్గాలంటున్నాయి. అయితే సింగరేణిని ప్రైవేటికరిస్తామని చెబుతున్న మోదీ ప్రభుత్వం దాన్ని విరమించుకున్నప్పుడే తెలంగాణలో పర్యటించాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. దేశంలోని సుమారు అయిదు వందల బొగ్గు బావులను ప్రైవేటు రంగానికి అప్పగించడంద్వారా కోల్‌ ఇం‌డియా, సింగరేణి సంస్థలను నిర్వీర్యం చేయాలనుకుంటున్న మోదీ ముందుగా దాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో ఆయన పర్యటన సందర్భంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని లెఫ్ట్ ‌పార్టీలతోపాటు కార్మిక సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తన హామీని నెరవేర్చలేదంటూ విద్యార్థి సంఘాలుకూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్శిటీల్లో కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బిల్లును తొక్కిపెట్టడాన్నికూడా నిరసిస్తూ మోదీ పర్యటనను అడ్డుకుంటామంటున్నారు. ఆలాగే వరంగల్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌, ‌పసుపు బోర్డు, నవోదయా పాఠశాలల ఏర్పాటు తదితర• అంశాలపై వివరణ ఇవ్వాలని తెరాస నాయకులు, వామపక్షాలు ,ఇతర సంఘాలు మోదీని డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page