మోహినీ రూపంలో మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు

  • భక్తులకు అభయ ప్రదానం ఇస్తూ సాగిన సేవ
  • స్వామిని దర్శించుకుని పులకించిన భక్తులు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. క్షీర సాగర మథనం సమయంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. ప్రపంచమంతా మాయా విలాసమని, తన భక్తులు కానివారు మాయాధీనులు కాక తప్పదని స్వామివారు బోధించారు. ఈ మాటను నిరూపించేందుకు ఆయన మోహినీ అవతారాన్ని ప్రదర్శించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు కోలాహలంగా మారాయి. పాటలు, నృత్యాలు, కోలాటాల ప్రదర్శనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఇష్ట దైవాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ప్రత్యేక స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి వెల కట్టలేనన్ని ఆభరణాలతో అలంకరిస్తారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే 5 అంచెల భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు.

తిరుపతికి వచ్చే 9 రోడ్లలో వెహికల్‌ ‌పాసులను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మాడ వీధల్లో 1.80 లక్షల మంది భక్తులు వాహనసేవలను వీక్షించవచ్చని, భక్తులందరూ సహనంతో నిబంధనలు పాటించాలని కోరారు.ఇదిలావుంటే హైకోర్టు సీజే జస్టిస్‌ ‌ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌మిశ్రా స్వామివారి పల్లకిని మోసారు. రాత్రికి మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ సందర్భంగా తిరుమల కనుమదారుల్లో బైకులకు అనుమతిని నిరాకరించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ద్విచక్రవాహనాలకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరు కుంటున్నారు. అన్నికంపార్టుమెంట్లు భక్తులతో నిండి అర కిలోటర్‌ ‌మేర నిలిచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. శుక్రవారం శ్రీవారిని 75, 382 మంది భక్తులు దర్శించుకోగా 31,424 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు వచ్చిందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page