రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. ఎంతో చరిత్ర కలిగిన వేములవాడకు మహర్దశ తీసుకుని వొస్తామని అన్నారు. ఇందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మహాశివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు.
వేములవాడ జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తామని కూడా అన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు, సంబంధిత అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సవి•క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..రాజన్న ఆలయానికి ప్రాశస్త్యం తీసుకుని వొస్తామన్నారు. జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.