యుగ పురుషుడు వివేకానందుడు

భారతదేశ సంస్కృతిని, ఆద్యాత్మిక చింతనను, విదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో, ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలను భారత సమాజం గర్వంగా గొప్పగా  నేటికీ గుర్తు చేసుకుంటునే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన తొలి హిందూ సన్యాసి కూడా వివేకానందనే కావడం విశేషం.
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’… ‘లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి’ వంటి వివేకానంద సూక్తులు ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన వివేకానందుని వ్యక్తిత్వాన్ని ఆయన జయంతి సందర్భంగా భారతీయులు ఏటా  స్మరించుకుంటున్నారు. ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుతోంది. స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12 తేదీన మకర సంక్రాతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. జులై 4, 1902న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య , తత్వ శాస్త్ర గ్రంధాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంధాలు, ఇలా ఎన్నో చదివే వారు. జీవించింది కేవలం 39 సంవత్సరాలే కానీ శతాబ్దాల పాటు   చెరిగిపోని ముద్ర వేశారు. తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు. మన దేశానికి ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం మొత్తం మీద తనకంటూ చేసుకున్నది, దాచుకున్నది ఏది లేదు. ఆయన విదేశాలలో ఎలాంటి ముద్ర వేశారంటే ఇప్పటికి అమెరికాలో ఒక వీధికి ‘‘స్వామి వివేకానంద స్ట్రీట్‌’’ అని పేరు పెట్టుకున్నారు అంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతున్నది. మహాత్మా గాంధీ , సుభాష్‌ చంద్రబోస్‌,  లోకమాన్య తిలక్‌, బిపిన్‌ చంద్ర పాల్‌ వంటి ఎంతోమంది స్వాతంత్ర యోధులకు వివేకానందుడే ఆదర్శం. . ‘‘మీరు ఇండియా గురించి తెలుసు కోవాలను కుంటే స్వామి వివేకానంద గురించి చదవండి’’ అన్నారు విశ్వకవి టాగోర్‌. ముఖ్యంగా యువతకోసం ఆయన ఎంతో తపించారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించి తద్వారా భారతీయ యువతకు దిశా నిర్దేశం చేశారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని,  యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు.

అందుకే ‘‘డబ్బు లేని వాడు కాదు… జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు’’ అనే వారు వివేకానంద. ఆయన ఎప్పుడు కూడా ‘‘గొర్రెలలా కాదు సింహంలా ధైరంగా బ్రతకమని’’ దేనికి భయపడవద్దని చెపుతుండే వారు. ’’ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను’’ అని స్వామీజీ తరచూ అనేవారు. మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపినవారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి 12 ను  ‘‘నేషనల్‌ యూత్‌ డే’’ గా జరుపు కుంటారు. ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో పుస్తకాలతో, యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. వ్యక్తి విజయవంతమైన జీవితం గడపడానికి కొన్ని సూత్రాలను వివేకానందుడు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావనలతో వ్యక్తిలో నిస్వార్థమైన వైఖరులు ఏర్పడతాయని వివరించారు. సుఖదు:ఖాలు నాణేనికి రెండు పార్శాలు లాంటివి. కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే సమయం వృథా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. విశ్వంలో ప్రతి అంశం తార్కిక ఆలోచనలతో ముడిపడి ఉంటుంది.

కాబట్టి తార్కిక ఆలోచనలతో ప్రపంచాన్ని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి. ఎవరి సామర్థ్యంపై వారికి నమ్మకం ఉండాలి. ఇతరులపై ఆధారపడే విధానానికి స్వస్తి పలకాలి. మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. కెరటం నాకు ఆదర్శం…  లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు. మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు… అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయ పడుతుంది.. ఇలా యువతకు వివేకానందుడు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశారు. జీవితం నిరాశ నిస్పృహలతో నిండిపోయి నప్పుడు, భయ భ్రాంతులకు గురైనపుడు, మనసు చెడు మార్గాలవైపు మళ్ళి ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నపుడు స్వామి వివేకానందకు సంబందించిన పుస్తకాలు, సూక్తులను చదవాలి. వివేకానందుడి సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్ధం తెలుస్తుంది. నిద్రాణమై ఉన్న భారత జాతిని మేల్కొలిపిన ఆ మహనీయుడు, యుగ పురుషుడు ఎప్పటికి మన గుండెల్లో నిలిచే ఉంటారు. (నేడు  వివేకానంద వర్థంతి)
 -రామకిష్టయ్య సంగనభట్ల
     9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page