యువశక్తే దేశ సంపద…

ఏ ‌దేశానికైనా యువతే భవిత. ఒక దేశ నిర్మాణానికీ, పురోగమనానికీ అవసరమైన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, భావి నేతలూ యువతరం నుంచే రావాల్సి ఉంటుంది. జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ కోణంలో చూసినప్పుడు ప్రపంచంలో భారతదేశం కంటే సంపన్నమైనది మరొకటి ఉండదు. ప్రపంచంలో మరే దేశానికీ ఇంతటి యువ సంపత్తి లేదంటే అతిశయోక్తి కాదు..! ఆ యువశక్తే నేడు దేశాభ్యుదయానికి పూనుకోవాలి.

దేశం కోసం తమ జీవితాలను అర్పించిన మహనీయుల అడుగు జాడల్లో నడవాలి. స్వాతంత్య్రం కోసం వారి నెత్తుటి ధారలను గుండెలకు హత్తుకోవాలి. దేశం గురించి వారు ఎన్నో కలలు కన్నారు. విద్యార్థులు నవసమాజ నిర్మాతలంటూ ప్రబోధాత్మక గీతాలు ఎన్ని వచ్చినా..కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులంటూ వారిలో నిద్రాణంగా ఉన్న ప్రతిభను తట్టి లేపేందుకు ప్రయత్నించినా..నేటి యువతే రేపటి భవిత అంటూ నాయకులు ఉత్తేజిత ప్రసంగాల జోరుతో హోరెత్తించినా.. అది ఎంత వరకూ యువశక్తికి ఉద్దీపన అవుతోంది? ఎంత వరకు వారిని జాతి నిర్మాణ బృహత్తర క్రతువుకు సన్నద్ధం చేస్తోందన్నది సమాధానం కోసం వెదకులాట స్థితిలోనే ఉన్నామనిపిస్తుంది. యువత మానసికంగా పరిపక్వం కావాలంటే.. అందుకు పరిసరాల పరంగానే కాకుండా సామాజికంగా అన్ని అంశాలు కలిసి రావాలి. అంటే..అన్నీ సమతూక రీతిలో అందివచ్చినప్పుడే ఈ రకమైన భావన వారిలో బలోపేతం అవుతుంది. యువత అంటే కేవలం ఫ్యాషన్‌కే పరిమితం కాదు. వాటికి తగిన ఊతాన్ని అందించడం ద్వారా అన్ని కోణాల్లోనూ జాతి నవ నిర్మాణానికి పురోగాముల్ని చేయాలి. ఇందుకు కేవలం వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా సామాజిక వాతావరణమూ శక్తివంతం కావాలి.

ఏ దేశానికి లేనంత యువ వనరులను ప్రోదిచేసుకున్న భారత్‌ ‌వాటిని సద్వినియోగం చేసుకోగలిగితేనే.. అంతర్జాతీయంగా రాణించగలుగుతుంది. ఎక్కడికో పోయి అవకాశాల్ని వెతుక్కునే పరిస్థితుల్ని తొలగించి దేశీయంగానే ఉన్నతమైన, విస్తృతమైన అవకాశాల్ని కల్పించాలి. సామాజిక మార్పుల దూతలుగా,ఆర్థిక, రాజకీయ చైతన్యానికి ప్రతీకలుగా భావించే యువత తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పరిరక్షించే విధంగా ముందుకు దూసుకు పోగలుగుతోందా? అందుకు తగ్గట్టుగా అన్ని విధాలుగా వారికి భిన్న రంగాల్లో అవకాశాలను అందించగలుగుతున్నామా అన్నదీ అంతుబట్టని అంశంగ మిగిలింది. నేటి పరిస్థితుల్లో ఉపాధే జీవనాధారం. ఇందుకు ప్రధాన హేతువు విద్య. ఎంతగా విద్యారంగంలో రాణిస్తే అంతగానూ అవకాశాలు లభిస్తాయన్నది వాస్తవమే అయినా.. అందుకు ప్రతికూలతలు, ప్రతిబంధకాలు ఎన్నో.. ఎన్నో..!.

యువత ఒకరకమైన సామాజిక జీవనానికి అలవాటైపోయింది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తీరాలను దాటే చొరవ, ధైర్యం, అందుకు అవసరమైన ఆర్థిక సంపత్తి కూడా అరకొరగానే ఉన్నాయి. ఉన్నచోటే ఉద్యోగం అన్న పరిమితి నుంచి బయట పడినప్పటికీ విదేశాల్లో లభించే అవకాశాలను నమ్మకంగా అందిపుచ్చుకో గలిగే సామర్థ్యం వారిలో మరింతగా బలపడాల్సి ఉంది. యువత మానసికంగా పరిపక్వం కావాలంటే.. అందుకు పరిసరాల పరంగానే కాకుండా సామాజికంగా అన్ని అంశాలు కలిసి రావాలి. అంటే..అన్నీ సమతూక రీతిలో అందివచ్చినప్పుడే ఈ రకమైన భావన వారిలో బలోపేతం అవుతుంది. ఎందుకంటే వీరిలో సామాజికమైన ఎన్నో అంశాల ప్రభావం చాలా బలంగానే ఉంటుంది. ధనిక పేద వ్యత్యాసం, పట్టణ-నగరాల మధ్య ఉన్న తేడాలు, కులం, వర్గం ఇలా ఒకటేమిటి వారిని మానసికంగా, సామాజికంగా కూడా ఎంతగానో ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అన్ని విధాలుగా ఆరితేరితే తప్ప మిగతావారి కంటే ముందుకు దూసుకు పోగలిగే సామర్థ్యం యువతలో పెంపొందే అవకాశం ఉండదు.

మిగతా దేశాలతో పోలిస్తే అన్ని విధాలుగా అవకాశాలను అందిపుచ్చుకునే దేశాభివృద్ధికి విశేషమైన రీతిలో దోహదం చేయగలిగే యువశక్తి భారత్‌కే ఉంది. ఇదే విషయాన్ని దేశదిశానిర్దేశకులు పలువురు పదేపదే చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించడంలో ఆరితేరిన రకంగానే భావించడానికి వీల్లేదు. వారిలో నిబిడీకృతమైన ఉన్న ఆలోచనల్ని, మనోభావాల్ని తట్టి లేపాలి. వాటికి తగిన ఊతాన్ని అందించడం ద్వారా అన్ని కోణాల్లోనూ జాతి నవ నిర్మాణానికి పురోగాముల్ని చేయాలి. ఇందుకు కేవలం వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా సామాజిక వాతావరణమూ శక్తివంతం కావాలి. మన దేశం. మన సంపద. మన అభివృద్ధి అనే బలమైన భావన వారిలో పాదుగొల్పినప్పుడే యువశక్తి ఉపయోగ పడుతుంది. పట్టణ, నగర, గ్రామీణ యువత అన్న తేడా లేకుండా ఎక్కడున్న యువశక్తికి తిరుగుండదన్న నమ్మకమూ కలుగుతుంది. ఇందుకు కావాల్సింది ఉపన్యాసాల ఊతం కాదు..చేతల్లో అందించే సాయం. అది ఏదైనా యువతకు మేలు చేయాలి. సమాజానికి, దేశానికి అన్ని విధాలుగా ప్రబల శక్తిగా మారేలా దోహదం చేయాలి. ఇందుకు ప్రస్తుతం విస్తరిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మించిన తరుణం లేదు. ఇందుకు కావాల్సిందల్లా వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టే రీతిలో సామాజిక వాతావరణాన్ని తీర్చిదిద్దాలి. దేశ భవితను, యువ శక్తినీ తీర్చిదిద్దుకోవాలి.

చదువులు, కట్టుబాట్లు, సాంఘిక నియమాలు, మనచుట్టూ ఉన్న సామాజిక వాతావరణం ఇవన్నీ ఈ వ్యవస్థను యథాతథంగా ఉంచడానికి ఉపయోగపడేవే. ఊడిగం చేసే వృత్తి నైపుణ్యాలనే తప్ప సామాజిక చైతన్యాన్నివ్వలేని చదువుల అర్ధాన్ని, ఈ చదువుల వెనుక అలోచనలను పసిగట్టాలి. చదువుకుంటే ప్రజలనీ, దేశంలో ప్రజలెదుర్కొంటున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలకు పరిష్కారమని తెలుస్తుంది. నిజమైన స్వాతంత్య్రం, సమానత్వంపై ఆధారపడే స్థానం ఏర్పడుతుంది. సాటి మనిషి కష్టాలకు స్పందించే సుగుణం అబ్బుతుంది. ఇవన్నీ యువతను మహోజ్వలం గావిస్తాయి. అలాంటి యువకులు తలుచుకుంటే సాధ్యం కానిదేదీ ఉండదు. ఇప్పుడు దేశానికి అటువంటి యువత కావాలి. సంపద ఎంత ముఖ్యమో సౌశీల్యం కూడా అంతే ముఖ్యం. ‘‘కొంత మంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు’’, అనే చరణాలు రుజువుచెయ్యాలి.

– నందిరాజు రాధాకృష్ణ, 98481 28215.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page