లారీ కిందపడి గర్భిణి దుర్మరణం
అనూహ్యంగా బయటపడ్డ బిడ్డ
లక్నో, జూలై 21 : ఒక విషాద సంఘటనలో అద్భుతం జరిగింది. ప్రమాదవశాత్తూ లారీ కింద పడి గర్భిణీ మరణించగా, అనూహ్యంగా ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ అద్భుత సంఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల కామిని 8 నెలల గర్భవతి. కాన్పు కోసం భర్త రాముతో కలిసి బైక్‌పై బుధవారం తన పుట్టింటికి బయలుదేరింది. అయితే ఫిరోజాబాద్ జిల్లాలోని బర్తర గ్రామం సపం వద్ద ఎదురుగా కారు రావడంతో భర్త రాము తన బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. కారును ఢీకొట్టకుండా ఉండేందుకు సడెన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో భర్త బైక్‌పై వెనుక కూర్చొన్న కామిని ఎగిరి రోడ్డుపై పడింది.
అంతలో ఒక లారీ వేగంగా ఆమె దుగా వెళ్లింది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో కామిని మరణించగా మిరాకిల్‌గా బిడ్డకు జన్మనిచ్చింది. లారీ తొక్కేయడంతో కామిని శరీరం నుజ్జు అయ్యింది. అయితే ఆమె కడుపు నుంచి ఆడ శిశువు సురక్షితంగా బయటపడింది. ఆ శిశివును వెంటనే ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగానే ఉన్నదని, ప్రాథమిక చికిత్స మాత్రమే అవసరమైందని వైద్యులు తెలిపారు. కాగా, కామిని భర్త రాము కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోయిన లారీని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి డ్రైవర్‌ను అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.