రంగంలోకి ట్రబుల్‌ ‌షూటర్‌..‌నిర్వాసితులతో చర్చలు సఫలం

  • మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం, కోదండరెడ్డి, నిర్వాసితులు చర్చలు
  • గౌరవెల్లి భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి (గూడాటిపల్లి గ్రామస్థులు)ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు రంగంలోకి దిగారు. ఫలితంగా నిర్వాసితుల సమస్యలకు ఓ పరిష్కారం దొరికింది. గత రెండు మూడ్రోజులుగా భూ నిర్వాసితుల ఆందోళనలతో హుస్నాబాద్‌ ‌ప్రాంతం ఉద్రిక్తతతో రణరంగంగా మారిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బుధవారం సిద్ధిపేట సమీపంలోని మెట్టుబండల వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం ప్రభాకర్‌, ‌కోదండరెడ్డి ఆధ్వర్యంలో 10మంది బృందంతో కూడిన గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కలిశారు.

భూ నిర్వాసితులను మంత్రి హరీష్‌రావు సాదరంగా ఆహ్వానించి గంటసేపు పాటు చర్చలు జరిగాయి. భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తానన్నారు. భూ నిర్వాసితులకు, కాంగ్రెస్‌ ‌నాయకులకు మంత్రి హరీష్‌రావు భోజనం పెట్టి పంపించారు. భూ నిర్వాసితులు, మంత్రి హరీష్‌రావుకు మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో గత కొన్ని రోజులుగా భూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలకు ఎండ్‌ ‌కార్డు పడినట్లే. అయితే, ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరు తెచ్చుకున్న మంత్రి హరీష్‌రావు మరోసారి తన పేరును రుజువు చేసుకున్నారు.

కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం, కోదండరెడ్డి ఆధ్వర్యంలో గౌరవెళ్లి భూ నిర్వాసితులతో చర్చలు జరిపి, డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడంతో గత కొంత కాలంగా అట్టుడుకుతున్న ప్రాంతాన్ని చల్లారబర్చడమే కాకుండా, భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాననీ చెప్పడంతో భూ నిర్వాసితులు ఒకింత సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రబుల్‌ ‌షూటర్‌ ‌మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగడంతో గౌరవెళ్లి భూ నిర్వాసితుల సమస్య పరిష్కారానికి నోచుకోవడంతో మరోసారి అందరూ మంత్రి హరీష్‌రావు గురించి మాట్లాడుకుంటున్నారు. దటీజ్‌ ‌హరీష్‌రావు అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page