కేసులు కొత్తేమీ కాదన్న ఎమ్మెల్యే రఘునందన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని….న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. రఘునందన్‌రావుపై ఐపీసీ 223(జీ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రఘునందన్‌రావు జుబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన ఆధారాలు కొన్నింటిని మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు, న్యాయస్థానానికి అందచేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని రఘునందన్ రావు ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు అబిడ్స్ పీఎస్‌లో రఘునందన్‌రావుపై కేసు నమోదు అయింది. మరోవైపు సాముహిక అత్యాచార బాధితురాలికి సంబంధించిన వివరాలను రిలీజ్ చేసిన ఓ జర్నలిస్టు సుభాన్పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ అవ్నిషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి.
ఈ వీడియో ఆధారంగా రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… తనకు కేసులు కొత్త కాదని అన్నారు. పోలీసుల నోటీసుల కోసం బీజేపీ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలసి రాజకీయంగా నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఇదే మెదటి..చివరి ఎఫ్ఐఆర్ కాదని, ఉద్యమంలో పోరాడిన వాడినని తెలిపారు. చట్టం తెలిసిన వాడిగా సాక్ష్యాలను మాత్రమే బయట పెట్టినట్లు తెలిపారు. కేసులను ఎదుర్కునడానికి సిద్దంగా ఉన్నానన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు.