‘‘ఒక వేళ బిజెపి లో చేరితే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఈటల రాజేందర్ బిజెపి లో చేరి ఎమ్మెల్యే ఐన తర్వాత హుజురాబాద్ లో ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా ..! హుజురాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ గాని,దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక ఎమ్మెల్యే గాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నుంచి ఏమైనా అదనంగా నిధులు తీసుకొచ్చారా..! అంటే అదనపు నిధులు ఏమి లేవు,అదనపు అభివృద్ధి ఏమి జరగలేదనేది సత్యం…’’
ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థ కు లోబడి జరగాల్సిందే.ప్రజల ఆకాంక్షలు, విశ్వాసాల మేరకే నియమిత కాలానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి.రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.ప్రభుత్వాలు సరిగా పనిచే యడం లేదని భావించినప్పుడు ప్రజలదే అంతిమ నిర్ణయా ధికారం.శాసన కర్తల అంతిమ లక్ష్యం సుపరిపాలన ను అందిం చేవిధంగా ఉండాలి.చట్టాల రూప కల్పన లో ప్రజాభిప్రాయం ప్రతిబి ంబించాలి.. చట్ట సభలలో ఉన్నవారు వారి సామాజిక, ఆర్ధిక పరిస్థితులను కూడా అపోహలకు తావు లేకుండా ప్రజల ముందు ఉంచాలి.అనాటి కాలంలోనే అరిస్టాటిల్ అభిప్రాయంలో ‘‘వ్యక్తుల పాలన కన్నా చట్టాల పాలన శ్రేష్టమైనది’’ అని చెప్పారు.కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు, నిర్మాణం, నిర్వాహణ అంతిమ లక్ష్యం ప్రజా విశ్వాసం మేరకే నడవాలి. రాచరికపు,మధ్యయుగ కాలంలో రాజులు-మతం ప్రధాన పాత్ర పోషించిప్పటికి అంతిమంగా ప్రజలే గెలిచారు.ప్రజా పోరాటాల ముందు రాజులైనా,రాజ్యాధినేతలైనా, తలవంచక తప్పలేదు.చరిత్ర నిర్మాతలు ప్రజలు అయ్యారు.కాని నేడు అన్ని వర్గాల ప్రజల సమ్మతితో ఏర్పడిన ప్రభుత్వాలు ‘‘ప్రజల’’ కేంద్రం గా గాకుండా కొంతమంది ‘‘వ్యక్తుల’’కేంద్రం గా నడుస్తున్నాయి, వ్యక్తిగత ఆకాంక్ష ల కోసం నడుస్తున్నాయి,వ్యక్తి కోరిక మేరకు అసందర్భమైన/అనవసరమైన ఎన్నికలు వస్తున్నాయి.అందులో భాగమే మునుగోడు ఉప ఎన్నిక.ఈ దేశంలో సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉప ఎన్నికలని మూడు స్థాయిలలో ఎన్నికలు జరుగుతుంటాయి.ఉప ఎన్నిక అంటే ఏదైనా స్థానానికి సిట్టింగ్ సభ్యుడు మరణించి ఖాలీ ఏర్పడితనో,రాజీనామా చేస్తనో వచ్చేది.
2018 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ లో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక లో రామలింగారెడ్డి మరణించినప్పుడు,నాగార్జున సాగర్ లో నోముల నర్సింహ్మయ్య మరణించినప్పుడు, హుజూర్ నగర్ ఎమ్యేల శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎంపిగా పోటి చేసినప్పుడు, హుజురాబాద్ ఎమ్యేలే పై భూకబ్జా ఆరోపణలు వచ్చినక్రమంలో రాజీనామా చేసినప్పుడు,ఇందులో రెండు ఉప ఎన్నికలు సహజ మరణాల ద్వారా వచ్చినవే.హుజూర్ నగర్ ఉప ఎన్నిక మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధమే.ఆల్రెడీ ఎమ్యేలే గా ఉన్నవారిని రాజీనామా చేయించి ఎంపి గా బరిలో నిలబెట్టడమంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మూర్ఖపు పనే.ఎంపి అభ్యర్థి గా మరొకరికి అవకాశం ఇచ్చి ఉంటే హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చేది కాదు. వందల కోట్ల ప్రజాధనం వృధా అయ్యేది కాదు.మరొక ఉప ఎన్నిక హుజురాబాద్. ఇక్కడ హుజురాబాద్ ఎమ్యేలేకు కేసీఆర్ కు మధ్యన వచ్చిన వైరం ప్రజా క్షేత్రం లో తేలుసుకునేలా చేసింది.సదరు ఎమ్యేలే భూ కబ్జాలకు పాల్పాడ్డాడనే ఆరోపణలు అధికార పార్టీ నే చేసిన పరిస్థితి. ఈ సమయంలో నే పెద్ద ఎత్తున ఆ ఎమ్యేలకు ప్రజాదరణ లభించింది.ఈ సందర్భంలో తన ఆత్మగౌరవం పై దాడి జరిగినది గా భావించి తె.రా.స కు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి భాజపా లోకి పోయిన పరిస్థితి.ఇక్కడే పౌర సమాజం నుంచి తలెత్తిన ప్రశ్న ఏమిటంటే నిజంగా ఆ ఎమ్యేలే ఆత్మగౌరవాన్నికే భంగం కలిగి ఉంటే జనం నుంచి వచ్చిన ఆదరణను తెలుసుకొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆత్మగౌరవ జెండా ఎగిరేసి ఉండవచ్చు .! పార్టీ లతో ఏమి పని.? ఉద్యమ నాయకునివే కదా.!రాష్ట్రం మొత్తం తిరిగి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టిఉండవచ్చు కదా…! అది చేయలేదు. అంటే తనకున్న విలువలను సైతం ఆస్థుల రక్షణ కోసం మరో అధికార పార్టీకి అమ్ముకున్నాడనే అపవాదం ఆ ఎమ్మేల్యే పై లేకపోలేదు. తెలంగాణలో వచ్చిన మరో ఐదో ఉప ఎన్నిక మునుగోడు.ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఎమ్యేలే రాజీనామా చేసారు.భాజపా లోకి పోయారు.తనుమాత్రం మునుగోడు అభివృద్ధి కోసమే,మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేసానంటున్నారు.చేసిన వ్యక్తి అదే పార్టీ నుంచి పోటి చేస్తే అధికార పార్టీ అభివృద్ధి చేయాలనుకుంటే చేయకపోవునా..!
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు( ఎమ్మెల్యేలు )అమ్ముడు పోయిన వారు మినహాయిస్తే మరికొంతమంది ఉన్నరు కదా .! వారి నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం కంటే ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా .! వారి నియోజకవర్గంలో జరిగిన అదనపు అభివృద్ధి ఏమిటి.? ఈయన నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఏమిటి.? వారు కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసారు కదా .! ఇతను కూడ మునుగోడు అభివృద్ధి పై రాష్ట్ర సమస్యల పై నిలదీసినరు కదా .! అభివృద్ధి పై ప్రశ్నించాల్సింద ..! అభివృద్ధి ని ఎవరు కాదనలేము.కాని మునుగోడు నియోజకవర్గం కంటే భిన్నంగా బిజెపి నియోజకవర్గ ఎమ్యేలే లు ఉన్న ప్రాంతాలలో ఏమైనా అభివృద్ధి ఏరులై పారిందా.! ఈ ఉప ఎన్నిక ద్వారానే అభివృద్ధి జరుగుతుందా..! వాస్తవం గా మును’’గోడు’’ కు వచ్చిన ఉప ఎన్నిక అనేది ప్రజల కోరుకుంటెనో,వారి గోడు చెప్పుకోవడానికో,వారి అభివృద్ధి కోసమో వచ్చిన ఉప ఎన్నిక కాదనేది స్థానిక ప్రజలే ఓపెన్ గా చెపుతున్న పరిస్థితి.ఎందుకంటే అక్కడి ఎమ్మెల్యేనిప్రజలు మాకోసం రాజీనామా చేయండి..మీరు రాజీనామా తో మునుగోడు అభివృద్ధి జరుగుతదని పోరాటాలు చెయ్యలే .! నియోజకవర్గానికి రావద్దని నిలబడి సదరు ఎమ్మెల్యేను నిలదీయలే .! ఆయన చెపుతున్నట్లు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రంలో బిజెపి ఐనా,కాంగ్రెస్ ఐనా రెండు ప్రతిపక్ష పార్టీ లే కదా.! కాంగ్రెస్ లో ఉంటే జరగని అభివృద్ధి బిజెపి లోకి పోతే జరుగుతుందా.! ఒక వేళ బిజెపి లో చేరితే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఈటల రాజేందర్ బిజెపి లో చేరి ఎమ్మెల్యే ఐన తర్వాత హుజురాబాద్ లో ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా ..! హుజురాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ గాని,దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక ఎమ్మెల్యే గాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నుంచి ఏమైనా అదనంగా నిధులు తీసుకొచ్చారా..! అంటే అదనపు నిధులు ఏమి లేవు,అదనపు అభివృద్ధి ఏమి జరగలేదనేది సత్యం..
మునుగోడు ఎమ్మెల్యే ఐనకానుంచి ఎన్నిసార్లు తన నియోజకవర్గ ప్రజల దగ్గర కు వచ్చిండు.? నెలకో,రెండు నెలలకో,మూడు నెలలకో ఒకసారి వచ్చి లక్షా,రెండు లక్షలు ప్రజలకు పంచి తన ఉనికి కోసం ఆర్భాటం చేయడమే తప్ప నిజంగా ఏనాడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా..! కనీసం తన క్యాంపు కార్యాలయ నిర్మాణం పూర్తి చేయించాడా.! ఏనాడైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా.! రాజీనామా చేసిన తర్వాత నిరంతరం నియోజకవర్గంలో ఎందుకు కలియ తిరుగుతున్నట్లు.? ఇదే పని అనాడు ఎందుకు చేయలేదు.?ఎవరి ప్రయోజనాల కోసం.? ఆనాడు క్యాంపు కార్యాలయాన్ని పూర్తి చేయనివారు..ఈరోజు కొత్త గా క్యాంపు కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేసినట్లు.?తను రాజీనామా చేసిన మూడు నెలలో అదనంగా జరిగిన అభివృద్ధి ఏమిటి..? ఏమిలేదు.ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఉప ఎన్నికలు వచ్చినా తెలంగాణ లో మునుగోడు కు జరుగబోయే ఉప ఎన్నిక వ్యక్తి స్వార్థం కోసం వచ్చిన ఉప ఎన్నిక మాత్రమే.. భాజపా ఎత్తుగడలో భాగంగా వచ్చిన ఎన్నిక మాత్రంగానే తెలంగాణ సమాజం భావిస్తుంది. సామాజిక, ఆర్ధిక నేరాల్లో భాగస్వామ్యం ఐన వ్యక్తులు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి పాలకపరమైన నిర్ణయాలలో కీలక పాత్ర పొషిస్తున్నారు.గతంలో ప్రతిపక్ష నాయకులకు కూడా పాలనాపరమైన నిర్ణయాలలో తమ అభిప్రాయాలకు విలువ,గౌరవం ఇచ్చేవారు.కాని పాలకులు చేస్తున్న స్వీయనుకూలమైన సవరణల ద్వారా భ్రష్ఠు పట్టిస్తున్నారు.
రాజ్యాంగబద్ద ఎన్నికల కమిషన్ స్వతంత్రం గా పనిచేస్తూ నిష్పక్షపాతంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికల ను నిర్వహించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలని రాజ్యాంగం చెబుతుంది.కాని ఆదిలోనే వాటికి తిలోదాకాలిచ్చి ఆయారాం,గయారాం పద్దతికి వీలుకల్పించారు.రాజకీయ పార్టీ ల ప్రస్తావన రాజ్యాంగంలో లేనప్పటికీ రాజ్యాంగేతర శక్తి గా అవి పని చేస్తున్నాయి.ప్రజల లక్ష్యాల కోసం,పాలనలో ప్రజల కు భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి.ఎన్నికలు కూడా వోటు విలువ కలిగిన వ్యక్తులందరిని ఏదో ఒక రూపంలో భాగస్వామ్యం చేయడం నేటి సంక్షేమ ప్రభుత్వాల లక్ష్యం.ఏలాంటి ధనస్వామ్యానికి ,అవినీతి కి ఆస్కారం లేని ప్రభుత్వాల నిర్మాణం ప్రజల లక్ష్యం.నాటి అభివృద్ధి పార్టీలకతీతంగా ప్రజలే కేంద్రంగా ఉండేది.కాని కాలక్రమంలో వచ్చిన పర్యావసానాల వలన పార్టీ ఫిరాయింపుల చట్టం అనివార్యం అయింది.ఈ చట్టం ప్రభుత్వాలలో పారదర్శకతను పెంచడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది.కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో వచ్చిన మార్పు వలన అనేక ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ధనస్వామ్యం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అనేక కమిషన్లు,కమిటీ లు ఏర్పడ్డాయి.వాటి సిఫార్సులను తుంగలో తొక్కి పాలక పక్షం తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని,తమ పట్ల వివక్షత కొనసాగిస్తుందని ప్రజల ఎజెండా అమలు కావడం లేదని కొంతమంది రాజకీయ టూరిస్టులు అవాకులు చవాకులు పేలుస్తున్నారు.అంతటితో ఆగకుండా పాలనా అనుభవం లేని అసమర్థులు భూబకాసురులను ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టి అంతిమంగా ఎన్నికల్లో గెలిస్తే మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తారనే భ్రమలో ప్రజలను ఉంచుతున్నారు.నియమిత కాలం పూర్తి కాకుండానే ప్రభుత్వాలను అర్ధాంతరంగా రద్దు చేయడం,శాసనకర్త లు కూడా అదే తొవ్వలో(నియమిత కాలానికంటే ముందే రాజీనామా) పయనిస్తున్నారు.
ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు దేనికీ సంకేతంగా తీసుకోవాలి..? ఎన్నికల్లో గెలుపు కోసం అనేక వక్ర మార్గాలను ఎంచుకొని మందబలంతో , ఆర్ధిక బలంతో తొడేళ్ళ మాదిరిగా నియోజకవర్గం లోని గ్రామాలపై పడి పచ్చని అనుబంధం ఆత్మీయత పెనువేసుకున్న ప్రజల మధ్య విద్వేషాలు,వర్గ,కుల స్వభావాన్ని పెంచి రాజకీయ లబ్ధి కోసం నానాతంటాలు పడుతున్నారు.ఎప్పుడు గూడాలు,తండాలు , వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోని దిల్లీ నుండి గల్లీ దాకా ఖద్దరు వస్త్రాల నాయకులు సహపంక్తి భోజనాలు, ఆధ్యాత్మిక చింతన పేరిట శిబిరాలు ఏర్పాటు చేసి ఆర కొర గా చదివిన జ్ఞానం తో మతిస్థిమితం లేని భాష ఉచ్ఛారణ తో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎన్నికలు అంటే ‘‘రాజకీయ పరిజ్ఞానం’’ కలిగిన వ్యక్తులు వెనుకంజ వేయడం దేనికీ నిదర్శనం.లాభాపేక్ష లేకుండా అభివృద్ధి అనే పదం ముందుకు తీసుకునే పరిస్థితి లేదు.ప్రజలకు నేటి ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల మీద నమ్మకం సన్నగిల్లింది.కావునా బుద్ధి జీవులు ఈ రాజీనామాల వలన కలిగే నష్ఠాన్ని,అర్ధాంతరంగా ప్రభుత్వాలు రద్దు చేయడం వలన కలిగే అనర్ధాలను గురించి,ప్రజా ధనం దుర్వినియోగం గురించి, ఎన్నికలలో అనుసరించాల్సిన గుణాత్మకమైన మార్పుల గూర్చి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది.రాజకీయ పార్టీ లు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణ గణాలు , వ్యక్తిగత విలువలు,నేర స్వభావం లేని వ్యక్తులను, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ కు విఘాతం కలిగించని వ్యక్తులను నిలబెట్టడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి పౌరసమాజం విశ్వసిస్తుంది, ఆ వైపుగా మునుగోడు ప్రజలు ఆలోచన చేస్తారని ఆశిస్తుంది.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192