రాష్ట్రంలో అతిపెద్ద జల ప్రళయం

మహబూబాద్ జిల్లాలో నలుగురి మృతి..
– ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఎక్సిగ్రేషియా
– బాధితులకు అండగా ఉంటాం..
– జిల్లాలో 30వేల ఎకరాలు పంట నష్టం అంచనా
– ఎకరానికి రూ.10 వేలు, పశువులకు రూ.50 వేల పరిహారం
– ముంపుగ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలి
– హైడ్రా తరహా జిల్లాలో చట్టం చేయాలి
– జిల్లాలో ఆక్రమణకు గురైన చెరువులపై చర్యలు తీసుకోవాలి
– మానుకోట రివ్యూలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 03: రాష్ట్రంలో మునుపెన్నడు లేనటువంటి జలప్రళయం సంభవించిందని ప్రజలకు, బాధితులకు అండగా ఉండి ధైర్యం నింపుదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విపత్తు నుంచి ఆయా ప్రాంతాలు కోలుకోవటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తు భవిష్యత్తులో ఇలాంటి విపత్తును తట్టుకునేలా మరమ్మతుల చేయాలని సూచించారు. మంగళవారం ఆయన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నష్టం గురించి ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క, ప్రభుత్వ ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే డా. రాంచంద్రునాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 28 సెం.మీ వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారన్నారు.

అయినా కూడా ఇద్దరు జిల్లా వాసులు, మరో ఇద్దరు ఖమ్మం జిల్లా వాసులు మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షంతో ఆవాసాలు కొల్పొయిన 680 మందికి పునరావాసం కల్పించామన్నమని, సీతారామతండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ సీరోల్ ఎస్ఐ నగేష్ కి అభినందనలు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆకేరు వాగు పరీవాహకంలో తరచూ ముంపునకు గురవుతున్న మరిపెడ మండలానికి చెందిన సీతారాం తండా, డోర్నకల్ మండలానికి చెందిన బురుగడ్డ తండా, మోదుగుగడ్డ తండాలను ఆయా తండా వాసుల అభ్యర్థన మేరకు అక్కడి సమీపాన ఆవాస యోగ్యమైన సురక్షిత ప్రాంతంలో కాలనీలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వరద ప్రభావంతో నష్టపోయిన పంటలకు రూ.10వేలు ఎకరాకు అందించాలన్నారు. మేకలు గొర్రెలు వరదలు పోయినందున వాటికి రూ.5వేలు, పశువులకు రూ.50వేలు నష్టపరిహారం అందిస్తామనన్నారు. వెంటనే అధికారులు నష్టపోయిన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలని సూచించారు. కూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాయడం జరిగిందని జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రిని కోరుతున్నామన్నారు.

సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలి..
వరద తగ్గిన తర్వాత జరిగే పర్యావరణాన్ని గుర్తించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, రోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలనీ దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలికూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలన్నారు. వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్ ను తయారు చేసి వాటిని కలెక్టరేట్లలో ఉంచాలని సూచించారు.

హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయండి..
హైడ్రా తరహాలో జిల్లాలో ఒక వ్యవస్థను కలెక్టర్లు  ఏర్పాటు చేయాలని, చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరమని జిల్లాలో అనేక చెరువులు కబ్జా గురైనట్లు తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. చెరువు ల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని, చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలి పెట్టమని హెచ్చరించారు. చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్దం చేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల వల్లే నేడు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వరదలు తీవ్రంగా వచ్చాయన్నారు. ఆక్రమణల తొలగింపునకు పక్కా ప్రణాళిక చేపడత్తామన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తన తరపున సహకారం అందిస్తుందని దాతలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందుకు కోరారు. వరద బాధితుల కోసం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఒక్కరోజు మూలవేతనాన్ని విరాళంగా ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థిని సాయి సింధు, తన కిట్టి బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 3వేలు ముఖ్యమంత్రి సహాయనిధి, వరద బాధితుల సహాయార్థంఅందజేశారు.

పదిహేడు వందల మందిని తరలించడం అభినందనీయం: మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అయిన రైల్వే ప్రయాణీకులు 17వందల మందిని సురక్షిత ప్రాంతాలకు పంపి వారికి కావాల్సిన ఆహారం, వసతి అందించి జిల్లాలో ఆస్తి,ప్రాణ నష్టం తగ్గించిన అధికంగా లేకుండా ముందస్తు ప్రణాలికలతో పనిచేసిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు కారణంగా నష్ట పోయిన వారి వివరాలు తెలుసుకుంటూ క్షేత్ర స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తూ, నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గ్రామాల వారీగా నష్ట వివరాలు సేకరించాలి: మంత్రి సీతక్క
రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ…విపత్తులు సంబవించినపుడు నష్ట నివారణ కోసం ప్రత్యేక అన్ని విభాగాలతో ప్రత్యేక కో..ఆర్డినేషన్ కమిటీ నియమించాలన్నారు. జిల్లాలో జరిగిన ప్రాణ, పశు, ఆస్తి, పంట, రోడ్లు, చెరువులు నష్టం యొక్క పూర్తి వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలో వర్షాల కారణంగా ముందస్తు ప్రణాళికలతో పనిచేసిన వారి సేవలు మరువలేనివి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page