రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం సాధించాయని అనుకోవచ్చు. ఒక చిన్న కేసులో అతనిని దోషిగా నిర్ధారించడం ద్వారా 56 అంగుళాల ఛాతీగల బిజెపి నాయకత్వం ఆందోళనతో చెమటలు కక్కుతూ భయం మీటను నొక్కడం చూస్తూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఎట్టకేలకు కాంగ్రెస్‌ ‌పార్టీ వారసుడు రాహుల్‌ ‌గాంధీకి శిక్ష పడింది. కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యుపిఎ హయాంలో నమోదైన వివిధ కుంభకోణాలలో భాగస్వామ్యం అయిన వాళ్లను, దేశాన్ని దోచుకున్న వారందరినీ జైలుకు పంపుతామని 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. .కానీ వాటిల్లో ఏ ఒక్క ఆరోపణ ఆధారంగా కాకుండా .. ఆశ్చర్యకరంగా 2019 లో రాహుల్‌ ‌గాంధీకి వ్యతిరేకంగా నమోదైన పరువు నష్టం కేసు బయటకొచ్చి.. మార్చి 23న, గుజరాత్‌, ‌సూరత్‌లోని మేజిస్ట్రేట్‌, ‌నరేంద్ర మోదీ ఇంటిపేరు గురించి చేసిన వ్యాఖ్యలకు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా కోర్టు అతనికి బెయిల్‌ ‌మంజూరు చేసి 30 రోజుల పాటు శిక్షను వాయిదా వేసింది.

2019, ఏప్రిల్‌ 13‌న కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ ‌గాంధీ ప్రజల్ని ఉద్ధేశించి నాదొక చిన్న ప్రశ్న అని సంధిచాడు. ‘అవునూ ….ఈ దొంగలందరి పేర్లు, మోదీ.. మోదీ.. మోదీ.. అంటూ ఎలా ఉన్నాయి ?? నిరావ్‌ ‌మోదీ లలిత్‌ ‌మోదీ, నరేంద్ర మోదీ.’’ అంటూ. పరువుతీయాలనో, లేదా కిందపరచాలనో నా ఉద్ధేశ్యం కాదు కానీ దేశాన్ని దోచుకొని పారిపోయిన దొంగలందరి ఇంటి పేరు ‘మోదీ’ అనే ఎందుకు ఉందీ…‘మోదీ’ అని ఇంటిపేరు ఉన్న వీరు దొంగలు ఎలా అయ్యారు అని నిస్పక్షపాతంగా ప్రశ్నించాడు.

అయితే ఇక్కడ మోదీ అనే ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలు అనే ఉద్ధేశ్యం అతని ప్రకటనలో కనిపించదు కాబట్టి ఆ ఇంటిపేరు ఉన్న సమూహపు పరువు తీయాలనో, వారిని అగౌరవపరచాలనేది ఆయన ఉద్దేశమని వాదించడం ఇక్కడ సమంజసం కాదు. అతని వ్యాఖ్యల్లోని వ్యంగ్యస్త్రాన్ని అర్థం చేసుకోవాలే తప్ప ఇంకేదో నిర్ధిష్టమైన లక్ష్యంతో చేసిన దాడిగా దీన్ని అనుకోవడానికి లేదు. నిజానికి ఎన్నికల ప్రసంగం సందర్భంగా, లలిత్‌ ‌మోదీ•, నీరవ్‌ ‌మోదీ ఇలా ఈ దొంగలందరికీ ‘మోదీ’ అనే పేరు ఉమ్మడిగా ఎందుకు వుందని అతను హాస్యాస్పదంగా, వ్యంగ్యంగా అడిగినపుడు ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ‘మొత్తం ‘మోదీ’ వర్గానికి పరువు నష్టం కలిగించేలా ఉందని మనం అనుకోవాలా?

అయితే ఇక్కడ మనకెవరికీ కనిపించనిది మేజిస్ట్రేట్‌కు కనిపించడం వైచిత్రం.. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో ‘‘ఆ దొంగలందరి’’ మధ్య ఉన్న ఈ సన్నని వ్యత్యాసాన్ని గమనించకపోవడం కనిపిస్తోంది. ‘‘మోదీ ఇంటిపేరు వున్నావాళ్ళంతా దొంగలే’’ అని ఆయన చేసిన ప్రకటనలు పరువు నష్టం కలిగించే మాటలా లేక ఆరోపణలకు సంబంధించినవా, దాని ఆధారంగా నిందితుడికి శిక్ష విధించవచ్చా లేదా అనేది చూడాలి. బహుశా, ఈ న్యాయమూర్తికి తన తీర్పును సమం చేయడానికి సాంకేతిక,తార్కిక అనుమతి చట్టపరంగా అవసరం అని అనిపించలేదేమో కాబోలు.

అంతేకాదు ఈ కేసుకి సంబంధించి ఒక అసాధారణమైన విషయం ఏంటంటే, కేసు దాఖలు చేసిన ఫిర్యాదుదారు 2022లో రాహుల్‌ ‌గాంధీపై విచారణకై హైకోర్టు నుండి స్టే కోరాడు. దాదాపు 12 నెలల పాటు విచారణను ఆలస్యం చేయడంలో విజయం సాధించాడు. సాధారణంగా ఏ కేసులోనైన నిందితుడు విచారణపై స్టే పొందేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ ఫిర్యాదుదారుడే కోరడం కనిపిస్తోంది.


వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీతో ఈ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై రాహుల్‌ ‌గాంధీ పార్లమెంటులో నరేంద్ర మోదీ పై పదునైన బాణాన్ని విసిరిన వారం తర్వాత, ఒక సంవత్సరం పాటు నిలిపివేసిన ఈ విచారణను పునఃప్రారంభించాలని ఫిర్యాదుదారు నిర్ణయం తీసుకున్నాడు.
అయితే రాహుల్‌ ఉద్దేశం ఏమైనప్పటికీ, ఇంటిపేరుతో పోలిక గలిగి పారిపోయిన వారితో మోదీని వ్యంగ్యంగా లింక్‌ ‌చేయడానికి అతను సరదాగానో, కొంటెగానో ఆ ప్రశ్నని వేసి వుండొచ్చు. అతను ఏ ఉద్దేశం ప్రకారం చేసినప్పటికీ, మోదీ ఇంటిపేరు ఉన్న వారందరూ దొంగలు అని సూచించడానికి ఏమీ లేనప్పటికీ, కోర్టులో రాహుల్‌ ‌దోషిగా తేలిన ఒక రోజు తర్వాత అనర్హుడిగా ప్రకటించబడినందు వల్ల ప్రభుత్వాన్ని సమస్యలో పడేసింది. రాహుల్‌ ‌గాంధీపై ఆరోపింపబడ్డ పరువునష్టం కేసులో తీర్పు చట్టబద్దతను పై కోర్టులో ఎలాగు సవాలు చేస్తారు. తీర్పుపై అప్పీల్‌ ‌చేయడానికి కోర్టు అతని శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్‌ ‌చేసింది కూడా వాస్తవాలు ఇలా ఉంటే వీటిని ఏవీ కూడా పరిగణనలోకి తీసుకోకుండా, తొందరపాటుతో అతను అనర్హుడనే నిర్ణయం తీసుకుంది పార్లమెంట్‌. ‌సమకాలీన భారతదేశం ప్రజాస్వామ్య ఆదర్శాలను వాటి స్ఫూర్తిని ఆచరించడంలో ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుందా లేక మెజారిటీ మద్దతుతో వాటిని కపటంగా కూల్చివేస్తోందా అనే పెద్ద ప్రశ్నను లోకసభ లేవనేత్తింది.

నిజానికి 2014 సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ ‌పార్టీ పైన చేసిన అవినీతి ఆరోపణలను సాక్ష్యాధారాలతో రుజువు చేసి కేసులో రాహుల్‌ ‌గాంధీకి శిక్ష పడితే యావత్‌ ‌దేశం మెచ్చుకునేది. కానీ పరువు నష్టం కేసులో అతనికి శిక్ష విధించడం అంటే ప్రస్తుత పాలక ప్రభుత్వం తన నాయకత్వాన్ని ప్రశ్నించడం ఇక్కడ సహించలేకపోతుందని కనిపిస్తుంది. ప్రభుత్వం అంటే అధికార పార్టీ, ప్రధానమంత్రి కలిస్తేనే ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహించకపోవడం చూస్తుంటే ఆ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది.

అదానీ కుంభకోణంపై పార్లమెంటులో విపక్షాలు పట్టుబుడుతున్న వేళ ..చర్చ కోసం విపక్షాల డిమాండ్‌ ‌నేపథ్యంలో ఒకవైపు గందరగోళం, అంతరాయాలు జరుగుతున్నప్పటికీ వాటికి సమాధానాలు ఇవ్వకుండా, ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం కల్పించకుండా రాహుల్‌ ‌గాంధీని దోషిగా నిర్ధారించడం ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. మరోవైపు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వాదిస్తూ లండన్‌లో రాహుల్‌ ‌గాంధీ చేసిన ప్రకటనలపై క్షమాపణలు కోరుతూ పార్లమెంట్‌ ‌కార్యకలాపాల కమిటి డిమాండ్‌ ‌చేయడం చూస్తుంటే అదానీ కుంభకోణంపై చర్చ కోసం ప్రతిపక్షాల చేస్తున్న డిమాండ్‌పై బిజెపి నాయకత్వం భయాందోళనలో ఉందని వెల్లడవుతోంది.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గత తొమ్మిదేళ్లుగా నేషనల్‌ ‌హెరాల్డ్ ‌చీటింగ్‌ ‌కేసులో, అగస్టావెస్ట్‌ల్యాండ్‌ ‌వీవీఐపీ హెలికాప్టర్‌ ‌డీల్‌ ‌స్కామ్‌లలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ ‌నేతలను జైలుకు పంపుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వారిపై అవినీతి ఆరోపణలు వచ్చిన కేసుల విషయంలో మాత్రం నెమ్మదిగా నత్త నడక సాగిస్తుంది. కానీ, రాహుల్‌ ‌గాంధీని పరువు నష్టం కేసులో జైలుకు పంపడం మాత్రం రాజకీయ పరంగా వారికి లాభదాయకంగా కనిపిస్తున్నట్లు ఉంది.

చట్టాన్ని పూర్తిగా అబద్దపు అల్లికల ఆధారంగా జిల్లా కోర్టుల నుండి ఆదేశాలు మంజూరుచేయించుకోవడం, పార్లమెంటును స్తంభింపజేయడానికి ట్రెజరీ బెంచ్‌ ‌నుండి విశ్వ ప్రయత్నాలు జరగడం చూస్తుంటే రాహుల్‌ ‌గాంధీని, కాంగ్రెస్‌ ‌నాయకత్వాన్ని వెనుకబడిన కులాలలో అప్రతిష్టపాలు చేయడంలో నిమగ్నమై ఉందని అర్థం అవుతోంది. ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ తప్ప తప్ప మరేమి కాదు. అయితే న్యాయ నిపుణులు రాహుల్‌ ‌నేరారోపణ వెనుక లాజిక్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనేది మరో విషయం. అయితే, పరువు నష్టం ఆరోపణలు పరువు నష్టం చట్టం అవసరాలను తీర్చలేవని చాలా మంది అంటున్నారు, చాలా మటుకు శిక్ష కూడా వింతగా ఉంటుందంటున్నారు.

లోక్‌సభ సచివాలయం రాహుల్‌ ‌గాంధీ పార్లమెంట్‌ ‌సభ్యత్వాన్ని లాక్కోవడానికి పన్నుతున్న పన్నాగాలని చూసి, అనేకమైన వాదనలను వినిపించే, ప్రశ్నించే వారిపై అనైతిక చర్యలతో, అధికారిక అనుమతితో ప్రభుత్వం నిస్సంకోచంగా వ్యవహరిస్తున్న ప్రతీకార ధోరణిని చూస్తూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కూడా.

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం సాధించాయని అనుకోవచ్చు. ఒక చిన్న కేసులో అతనిని దోషిగా నిర్ధారించడం ద్వారా 56 అంగుళాలఛాతీగల బిజెపి నాయకత్వం ఆందోళనతో చెమటలు కక్కుతూ భయం మీటను నొక్కడం చూస్తూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

-శ్యామ్‌
‌తెలుగు అనువాదం : దియా విఘ్నేష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page