రుణమాఫీపై కావాలనే బిఆర్‌ఎస్‌ ‌యాగీ

గతంలో లాగా అప్పులు చేయడం లేదు
కెసిఆర్‌ ‌ప్రభుత్వంలా మోసం చేయట్లేదు
నా ఫామ్‌ ‌హౌజ్‌ అ‌క్రమమైతే కూల్చేయవచ్చు
మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ హామీలు అమలు చేశామన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పాటైన నాటికి  రాష్ట్రం రూ.7.19 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పి కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తాము ఇతర ఖర్చులన్నీ తగ్గించుకుని ప్రజలకు రుణమాఫీ చేశామని, ఇప్పటికే 22 లక్షలమంది రైతులకు రూ.2 లక్షల లోపు రుణలు మాఫీ చేశామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా తాము రుణమాఫీ చేశామని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమయ్యాయని, మిగిలిన రైతుల ఖాతాల్లో మరో రూ.12 వేల కోట్లు త్వరలోనే వేస్తామని పొంగులేటి తెలిపారు.

గత కేసీఆర్‌ ‌ప్రభుత్వంలా తాము మోసం చేయట్లేదని, కేసీఆర్‌ ‌ప్రభుత్వం రుణమాఫీ పేర ప్రజలను రెండుసార్లు మోసం చేసిందని, రూ.లక్ష రుణమాఫీ విడతల వారీగా చేస్తామని చెప్పి ఐదేళ్లలో కూడా చేయకుండా.. ఎన్నికల ముందు కొందరికే రుణమాఫీ చేశారని మంత్రి విమర్శించారు. చేసిన మంచి పనిని కూడా తాము ప్రచారం చేసుకోలేదని, గత ప్రభుత్వంలా ప్రచారం కోసం రూ.వేల కోట్లు వృథా చేయడం లేదని అన్నారు. ఉచిత విద్యుత్‌ ‌కోసం రూ.42 లక్షల దరఖాస్తులు మాత్రమే సరిగా ఉన్నట్లు గుర్తించామని, తప్పులు సవరించి మరో 7 లక్షల మందికిపైగా ఉచిత విద్యుత్‌ ‌వర్తింప చేస్తున్నామని, ఉచిత కరెంట్‌, ‌గ్యాస్‌ ‌రాయితీ లబ్దిదారుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉందని, దరఖాస్తుల్లో తప్పులు సవరించే పక్రియ నిరంతరం కొనసాగుతుందని పొంగులేటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్నవారి ఖాతాల్లో నిధులు వేయలేదని, రూ.2 లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లించాలని రైతులకు సూచించామని తెలిపారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని తాము పదే పదే చెప్పామని, దానిని దృష్టిలో ఉంచుకుని బిఆర్‌ఎస్‌ ‌నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి..కొత్త ఆర్వోఆర్‌ ‌తీసుకొస్తున్నామని, తెలంగాణ ఆర్వోఆర్‌.. ‌దేశానికే మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ఇక తాము హైడ్రాను మంచి ఉద్దేశంతోనే తెచ్చామని, ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌జోన్‌ ‌పరిధిలోని నిర్మాణాలకు అనుమతించేది లేదని, అలాంటి కట్టడాలను కూల్చివేస్తున్నామని, అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలని తెలిపారు. హిమయత్‌ ‌సాగర్‌ ‌ప్రాంతంలో ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో తన ఫామ్‌హౌజ్‌ ఉం‌దని బిఆర్‌ఎస్‌ ‌మీడియా బురద జల్లుతుందని, కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుకు తాను సవాల్‌ ‌చేస్తున్నానని, తన ఇల్లు అక్రమంగా ఉంటే.. వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నానన్నారు. తమ అధికారులకు బదులు బిఆరర్‌ఎస్‌ ‌వారే వెళ్లి కొలవండని, అక్రమం అని తేలితే.. కూల్చేయండని  పొంగులేటి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page