పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉసికే బావి కల్వర్టు నిర్మాణ పనులకు శాశ్వత పరిష్కారంగా రెండు కోట్ల రూపాయలు కేటాయించడంతోపాటు, శరవేగంగా పనులు పూర్తి చేస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య కాలనీ, గ్రీన్ మెడోస్, గ్రీన్ ఫీల్డ్ కాలనీలలో రెండు కోట్ల 95 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14వ వార్డు పరిధిలోని ఉసికే బావి నుండి రామచంద్రాపురం డివిజన్ నుండి జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా శాశ్వత ప్రాతిపదికన రెండు కోట్ల రూపాయలతో నూతన కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సుమారు 30 కాలనీలకు పైగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.మున్సిపల్ నిధులతోపాటు ప్రత్యేక నిధుల ద్వారా అన్ని కాలనీలలో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. సీసీ రోడ్లు అంతర్గత మురుగునీటి కాలువలతో పాటు పార్కులు చెరువులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు ఏనుగు కవిత శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, చంద్రకళ గోపాల్, బాలమణి బాలరాజు, ప్రమోద్ రెడ్డి, కో- ఆప్షన్ సభ్యులు యూనూస్, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.