రెండు గంటలకోసారి సెల్ఫీలు తప్పనిసరి

  • వాటిని నిర్దేవిత వెబ్‌లో అప్‌లోడ్‌ ‌చేయాల్సిందే
  • వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ‌కాటంనేని భాస్కర్‌
  • ‌తాజా ఆదేశాలతో ప్రభుత్వ వైద్యుల్లో ఆందోళన

అమరావతి,మార్చి18 : ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ‌కాటంనేని భాస్కర్‌ ‌సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రతీ రెండు గంటలకు ఒకసారి సెల్ఫీలు తీసి పంపాలని ఆదేశించారు. డ్యూటీలో ఉన్న సమయంలో రెండు గంటలకు ఒకసారి ఈ సెల్ఫీలను అప్‌లోడ్‌ ‌చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ‌స్పష్టం చేశారు. ఈ ఆదేశాలతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ వైద్యులు… ప్రైవేటు ప్రాక్టీసు చేయడం, డ్యూటీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మొత్తంగా ఏపీ ప్రభుత్వ వైద్యుల్లో కొత్త కలవరం మొదలైంది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ఇచ్చిన కొన్ని ఆదేశాలే ఆ కలవరానికి, కలకలానికి కారణం. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వైద్యులందరూ అటెండెన్స్ ‌కోసం బయోమెట్రిక్‌ ‌కచ్చితంగా వాడాలి. దాంతోపాటు ఆస్పత్రిలోనే ఉన్నాం అని చెప్పేలాఓ సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ ‌చెయ్యాలి. ఈ ఆదేశాలే ఇప్పుడు ఏపీలోని వైద్యులకు మింగుడుపడడంలేదు. తాజాగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి కమిషనర్‌ ‌భాస్కర్‌ ‌సక్ష నిర్వహించారు. వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం సరిగా అందడంలేదని చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో భాస్కర్‌ ఈ ఆదేశాలిచ్చారు. ప్రతీఒక్కరు బయోమెట్రిక్‌ ‌వాడాలి. దాంతోపాటు గంటగంటకూ సెల్ఫీ అప్‌లోడ్‌ ‌చెయ్యాలి. ఆ సెల్ఫీ కూడా ఎక్కడో తీసిందికాదు.. ఆస్పత్రి ప్రాంగణం, తమ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లుగా చూపించేదిగా ఉండాలి.

ఈ ఆదేశాలతో ఒక్కసారిగా వైద్యుల్లో దడ మొదలైంది. కొందరు అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా అంటూ ప్రతిఘటిస్తుంటే మహిళా డాక్టర్లు మాత్రం ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు ఫోటోలు అప్‌లోడ్‌ ‌చేస్తే సెక్యూరిటీ ఎలా ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, వైద్యం అందండలేదని వస్తున్న ఫిర్యాదులకు విరుగుడుగా భాస్కర్‌, ‌సెల్ఫీల అప్‌లోడ్‌ ‌నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిద్వారా నిరంతరం ఉద్యోగులపై పర్యవేక్షణ సాధ్యమని భావిస్తోంది. ఈ విధానం అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిని ముందుగా ఆరోగ్యశాఖలో అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పీహెచ్‌సీల నుంచి ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయాల వరకూ విధులు నిర్వహించే ప్రతి వైద్యుడూ రోజుకు ఐదు సెల్పీలు దిగాలి. ఉదయం 9గంటలకు విధులకు హాజరయ్యేటప్పుడు మొదటి సెల్ఫీ తీసుకుని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేయాలి.

ఆ తర్వాత 11 గంటలకు, ఒంటి గంట, 3 గంటలకు, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో అంటే 4గంటలకు ఒక్కో సెల్ఫీ చొప్పున తీసుకోవాలి. అధికారులు సూచించిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో వాటిని అప్‌లోడ్‌ ‌చేయాలి. ఆ నెలలో ఉండాల్సిన అన్ని సెల్పీలు ఉంటేనే జీతం ఇస్తారు. తొలుత ప్రతి గంటకు ఒక సెల్ఫీ అప్‌లోడ్‌ ‌చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ గంట గంటకూ సెల్ఫీ అంటే కష్టమన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో దాన్ని 2 గంటలకు మార్చారు. దీంతో పాటు బయోమెట్రిక్‌ ‌కూడా అమలులో ఉంటుంది. దాని ప్రకారం ప్రైవేటు ప్రాక్టీస్‌ ‌చేసే వైద్యులపై చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులంతా ప్రైవేటు ప్రాక్టీస్‌కే ప్రాధాన్యమిస్తూ, ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండటం లేదని ప్రభుత్వం, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వారి ప్రైవేటు ప్రాక్టీస్‌ను నిషేధించడానికి ఏడాదిన్నరగా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page