- ఎఐసిసి కార్యాలయం వద్ద భారీగా కాంగ్రెస్ శ్రేణులు
- పోలీసులుతో వాగ్వాదం..పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసుల మొహరింపు
న్యూ దిల్లీ, జూన్ 14 : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ రెండోరోజూ కొనసాగింది. రెండోరోజు ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ముందుగా ప్రియాంకతో కలసి ఎఐసిసి ఆఫీస్‌కు వొచ్చిన రాహుల్…ఆ తర్వాత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాహుల్ వెంట ఉన్నారు. సీపీఆర్‌ఎఫ్ ఎస్కార్ట్ సెక్యూరిటీతో ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ వెళ్లారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్య నేతలనే ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. ఇతర కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. దీంతో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యాలయంలోకి వెళ్లలేకపోయారు. పార్టీ కార్యాలయానికి ఎవరి వాహనాల్లో వారు వెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మాన్ సింగ్ రోడ్ సర్కిల్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టేరు. ఆందోళన చేస్తున్న కొందరు కాంగ్రెస్ ఎంపీలను నిర్బంధించారు దిల్లీ పోలీసులు.
ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు హరీశ్ రావత్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలాను అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు దిగిన కొందరు కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. రాహుల్ ఈడీ విచారణ దృష్ట్యా దిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. అక్బర్ రోడ్, జన్ పథ్ రోడ్, అబ్దుల్ కలాం మార్గ్, పృథ్వీరాజ్ రోడ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, సునేబ్రీ బాగ్ మార్గాలను పోలీసులు మూసేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయ పరిసరాలు, ఈడీ ఆఫీస్ పరిసరాల్లో సెక్షన్ 144 విధించారు. అయినా మంగళవారం కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టడతారని.. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఏఐసీసీ కార్యాలయం దగ్గరికి..కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ముందుగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు రాహుల్‌కు సంఘీభావం తెలిపారు.