రైతులతో చర్చించి… డిస్ట్రిబ్యూటరీ, మైనర్‌ ‌కాలువలకు అవసరమైన భూసేకరణ చేపట్టాలి

అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం

సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులలో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్‌ ‌కాల్వలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈఎన్‌సి హరీరామ్‌, ‌సిద్ధిపేట ఇంచార్జి ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ‌బస్వరాజ్‌, ఈఈలు గోపాలకృష్ణ, సాయిబాబు, వేణుబాబు, ఇరిగేషన్‌ ‌శాఖ డీఈలు, ఏఈలు, అధికారులతో నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్‌, ‌నంగునూరు, సిద్ధిపేట రూరల్‌, ‌నారాయణరావుపేట, సిద్ధిపేట అర్బన్‌ ‌మండలాల సాగునీటి కాల్వల భూసేకరణపై మంత్రి సమక్షంలో సమీక్ష నిర్వహించారు. రంగనాయక సాగర్‌ ‌కుడి ప్రధాన కాలువ ద్వారా మైనర్స్, ‌డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, ఎల్డీ-4 నుంచి ఎల్డీ-10 వరకూ డిస్ట్రిబ్యూటరీ కాల్వలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

కాల్వల కోసం భూమిని సేకరించిన, సేకరించాల్సిన అవశ్యకతను వివరిస్తూ.. మండలాలు, గ్రామాల వారీగా సమీక్షలో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలపై చేపట్టాల్సిన చర్యలపై ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, తహశీల్దార్లు, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. రంగనాయక సాగర్‌ ‌ప్రాజెక్టు ద్వారా లింకేజీ, ప్యారలాల్‌, ‌డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌పై ఆరా తీశారు. రంగనాయక సాగర్‌ ‌మైనర్‌, ‌డిస్ట్రిబ్యూటరీ కాల్వలతో పాటు, ఎల్డీ-4 నుంచి ఎల్డీ-10 వరకూ డిస్ట్రిబ్యూటరీ కాల్వల భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులకు, కాంట్రాక్టర్లకు మంత్రి ఆదేశించారు. రంగనాయక సాగర్‌ ఎడమ ప్రధాన కాలువ ద్వారా మైనర్‌, ‌డిస్ట్రిబ్యూటరీ కాల్వలపై రైతులతో చర్చించి భూసేకరణ చేపట్టాలని రెవెన్యూ, ఇరిగేషన్‌, ‌కాంట్రాక్టర్లకు మంత్రి హరీష్‌రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page