- అప్రమత్తంగా ఉండాలి… జాగ్రత్తలు తీసుకోవాలి
- డెంగ్యూతో పాటు, మలేరియా వ్యాప్తి చెందే అవకాశాలు
- రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12: వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న డీహెచ్.. కొరోనా తగ్గాక డెంగ్యూ కేసులు అధికంగా వొస్తున్నాయన్నారు. దోమలు, అపరిశుభ్ర వాతావరణంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. నీరు, ఆహారం కలుషితమైతే విషజ్వరాలు వొస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది డెంగీతో పాటు టైఫాయిడ్ కేసులు పెరిగాయన్నారు. మంచినీరు, ఆహారంపై దోమలు వాలకుండా ఉండాలని.. ఫ్రెష్ కూరగాయలు, వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిదని సూచించారు.
సాధ్యమైనంతవరకు డ్రింకింగ్ వాటర్ వేడి చేసుకుని తాగితే చాలా మంచిదన్నారు. పానీపూరి, బయటి ఫుడ్ తినేటప్పుడు శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలన్నారు. చిన్న నొప్పులే కదా అని లైట్ తీసుకుని ప్రాణాలవి•దకు తెచ్చుకోవద్దని.. జ్వరం వొచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని..దగ్గరిలోని సర్కార్ హాస్పిటల్‌కి వెళ్లి ఫ్రీగా మంచి ట్రీట్ మెంట్ తీసుకోవాలన్నారు.
సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని సర్కార్ హాస్పిటల్స్‌లో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని డీహెచ్ శ్రీనివాస్ సూచించారు. వాతావరణంలో మార్పులతో, సీజనల్ వ్యాధులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దోమలు వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా హైదరాబాద్‌లో మరో 12 గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని, బలమైన గాలులతో వర్షం కురుస్తుందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.