- అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య
- హైదరాబాద్‌కు గర్వకారణమన్న రాష్ట్ర మంత్రి వేముల
- ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 25 : వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఏషియన్ బిగ్గెస్ట్ ఏవియేషన్ ఎక్స్‌పోను పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సల్, ఎయిర్ పోర్టస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టీ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ఎక్స్ పో గురువారమే ప్రారంభమైంది. అయితే అధికారికంగా శుక్రవారం జ్యోతిరాదిత్య ప్రారంభించారు. ఈ నెల 27 వరకు వింగ్స్ ఇండియా ఎక్స్ పో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఎయిరో స్పేస్ తయారీ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏవియేషన్ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్టాన్రికి ప్రాధాన్య రంగాలని ఆయన చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్ షోలో భాగంగా వింగ్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్లయింగ్ ఫర్ ఆల్ విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. పాత విమానాశ్రయాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను అభివృద్ధికి చేస్తున్నామన్నారు. వాటర్ ఎయిరో డ్రోమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.అన్ని జిల్లాల్లో హెలీప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రోన్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం తన విజన్‌ను చాటిచెప్పిందన్నారు.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2022 ఏవియేషన్ షో సందర్శకులను అలరిస్తోంది. గతేడాది బోయింగ్ విమానాల హంగులను చూసిన నగరవాసులను….ఈసారి ఎయిర్‌బస్ సొగసులు, ఎంబ్రరర్ రాజసం, ఫైటర్ జెట్ విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. ఆర్మీ హెలికాప్టర్లు, చార్టెడ్ ఫ్లయిట్లు, కమర్షియల్ విమానాలు ఇలా పది వరకు విమానాలు రన్‌వేపై సందర్శకుల కోసం నిలిపి ఉంచారు. విమానాల లోపలి ఫీచర్లు, పనితీరు, బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై ఎగ్జిబిటర్లు…. సందర్శకులకు వివరిస్తున్నారు. మొదటి రోజు బీ2బీ వి•టింగ్స్‌లో భాగంగా ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత పౌరవిమానయాన శాఖతో…. తమ భాగస్వామ్యం, భవిష్యత్తు ఏవియేషన్ ప్రణాళికలు పంచుకున్నాయి. విమానాల ప్రదర్శనతోపాటు… ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రకటలను వెలువరించాయి.
భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని రాబోయే ఇరవై ఏళ్లలో 2 వేల 210 విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్‌బస్ ప్రకటించింది. ప్రముఖ విమాన ఇంజన్ల తయారీ కంపెనీ…. ప్రాట్ అండ్ విట్నీ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా బెంగళూరులో తమ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. క్రమంగా భారత్‌లోని ఇతర నగరాలకు ఈ ఫెసిలిటీని విస్తరిస్తామని పేర్కొంది.ఏవియేషన్ షోలో భాగంగా ఎయిర్ బస్ 350 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిజినెస్ డెలిగేషన్, ఎగ్జిబిటర్ల కోసం… ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫీచర్లను ప్రదర్శించారు. ఏవియేషన్ షోలో భాగంగా సందర్శకుల కోసం వింగ్ కమాండర్ కొమర్, స్క్వాడ్రన్ లీడర్ అక్షయ్ టీం ఆధ్వర్యంలోని సారంగ్ టీమ్ చేసిన విన్యాసాలు చూపరులను అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని విన్యాసాలను వీక్షించారు.