- రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందచేత
- హాజరైన రాహుల్ గాంధీ, కెటిఆర్, పవార్, అఖిలేష్, ఏచూరి తదితరులు
న్యూ దిల్లీ, జూన్ 27 : విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. ఆయన వెంట కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు వెంటరాగా ఆయనతన నామినేష్ వేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్‌కు ముందు..సిన్హాను బలపరుస్తున్న పార్టీల నేతలంతా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక..ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరు అని పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు. ఓవైపు ఆర్ఎస్ఎస్పై ద్వేషం, మరోవైపు అన్ని విపక్షాల కరుణ అనే రెండు సిద్దాంతాల మధ్యే అసలైన పోరాటం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
యశ్వంత్ సిన్హాను ఉత్తమ అభ్యర్థిగా తాము భావిస్తున్నామని, అందుకే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ తెలిపారు. అత్యున్నత విలువలతో ఉన్న కూటమి తమదని ఆయన చెప్పారు. తాము ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు గౌరవిస్తామని, కానీ ఎన్నికల్లో మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తామని సీపీఏం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హాకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, తెరాస, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు సిన్హాకు అండగా నిలిచాయి. యశ్వంత్ సిన్హా బిహార్ పట్నాలో 1937 నవంబర్ 6న జన్మించారు.
1958లో యూనివర్సిటీ ఆఫ్ పట్నాలో పొలిటికల్ సైన్స్?లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే 1962 వరకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1960లోనే సిన్హా ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు సేవలందించారు. పలు కీలక పదవులు చేపట్టారు. అనంతరం 1984లో జనత పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాకు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలందించిన అనుభవం ఉంది. అందుకే ఆయనే రాష్ట్రపతి అభ్యర్థికి సరైన వ్యక్తి అని భావించి విపక్షాలు ఏకాభిప్రాయంతో ఆయన పేరును ఖరారు చేశాయి.