శ్రావణమాసం.. నెలరోజులపాటు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది పవిత్రత కలిగిన శ్రావణమాసం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉందంటున్నారు విజ్ఞులు. అంతటి పవిత్ర మాసం నేడు మొదలైంది. ఈ నెలరోజుల్లో ఎన్నో మంచి రోజులు, పండుగలు వస్తున్నాయి.
వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి.
ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రం చెబుతోంది. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఉపవాసదీక్ష చేయాలి. దీనివలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదాలు చెబుతున్నాయి.
మంగళ గౌరీ వ్రతం..
శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు . శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేస్తే నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.
వరలక్ష్మీ వ్రతం: శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ..
శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం.
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే..
శ్లోకాన్ని పఠిస్తూ చేతికి కంకణం కట్టుకోవాలి. అలాగే మంత్రాలను ఉచ్చరిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..
శ్రావణ మాసంలోని విశిష్టతలు..శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. శుక్ల పక్ష పౌర్ణమి : శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం.
అంతే కాక ఈ రోజున నూతన యజ్ఞోపవీతం ధరించి, వేదభ్యాసాన్ని ప్రారంభిస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత.. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుతాయంటున్నారు పెద్దలు.
– నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్