సృష్టికి మూలాధారం బ్రహ్మ. కానీ ఆ సృష్టిలో దేవతల, మానవుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతతో నగరాలను, సౌకర్యాలను నిర్మించి ప్రతిసృష్టిని సైతం చేయగల నైపుణ్యం కలిగిన ఆది సాంకేతిక నిపుణుడు విశ్వకర్మ అని మన వేదాలు, హిందూ చారిత్రిక గ్రంథాలు తెలుపుతున్నాయి.
మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు అనే పంచముఖాలు కలిగిన ఆది సర్వజ్ఞ సాంకేతిక నిపుణుడు, ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణవేదం లాంటి ప్రాచీన చారిత్రిక వేదాలలో సృష్టికర్తగా అభివర్ణించబడ్డ విశ్వకర్మను పూజించడానికి ఒక రోజుగా భక్తులు నిర్ణయానికి వచ్చిన సందర్భంలో ఆ విషయం తెలుసుకున్న విశ్వకర్మ వ్యక్తిపూజ సరికాదని.. తమ తమ వృత్తులను, భుక్తికి కారణమైన పనిముట్లను, యంత్రాలను, కర్మాగారాలను పూజించాలని, అలా పూజిస్తే తనను పూజించినట్లే భావిస్తానని విశ్వకర్మ తెలుపడంతో.. అప్పటినుండి పలు వృత్తుల నైపుణ్యకారులు, కార్మికులు, విశ్వకర్మ భక్తులు వారి వారి పనిముట్లను, యంత్రాలను, కర్మాగారాలను పూజిస్తూ విశ్వకర్మ జయంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని చరిత్ర తెలుపుతోంది. బాధ్రపద మాసంలో సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహ రాశిని వదిలి కన్య రాశిలోకి ప్రవేశించే సమయం (కన్యా సంక్రమణంను) విశ్వకర్మ జయంతిగా భావించి ఆరోజు పనిముట్లను, యంత్రాలను, కర్మాగారాలను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ పండుగ మొదలవుతుంది.
విశ్వకర్మ.. విశ్వబ్రాహ్మణుల వృత్తాంతం
మూల స్తంభ పురాణంలో పేర్కొన్న ఓ శ్లోకాన్ని పరిశీలిస్తే..
శ్లో।।నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః
సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ.
తాత్పర్యం: భూమి – నీరు – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర -సూర్య – నక్షత్రములు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తాను స్వయంభు రూపమై అవతరించినాడు. ఐదు ముఖాలతో పంచ తత్వాలతో, పంచరంగులతో, పంచకృత్యములతో వెలసిన విశ్వకర్మ దేవుడు విశ్వబ్రాహ్మణులకు కులగురువైనాడని తెలుపుతోంది. అలాగే మరికొన్ని వేదాలలో విశ్వకర్మను సృష్టికర్తగా అభివర్ణించడం జరిగింది. అయితే, కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి, కానీ ఇది వాస్తవం కాదని తొలివేదాలు స్పష్టం చేస్తున్నాయి. తొలి వేదం నుండి మలి వేద ప్రక్రియ వచ్చేసరికి ఆనాటి కొన్ని సాంఘీక దుష్టశక్తుల ప్రభావంతో స్వయంభూగా వెలసిన విశ్వకర్మ భగవానుని గురించి ప్రత్యేకించి ప్రస్తావన చేయలేదు. ఆ కారణం చేత సామాన్యులకు అసలు విశ్వకర్మ భగవానుడు ఎవరో తెలియక, అవగాహన లేకుండా చేసేలా రచనలు, చర్చలు వచ్చాయి. అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు విశ్వకర్మ అని ఋగ్వేదము విశ్వకర్మను భగవంతునిగా పరిగణించింది. మహాభారతం విశ్వకర్మను వేయికళలకు అధిపతిగా అభివర్ణించింది. నాలుగు యుగాలలో విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నిర్మించాడని, సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకంను, త్రేతాయుగంలో శివుని కోసం సువర్ణ లంకను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కోసం ద్వారక నగరాన్ని, అలాగే కలియుగంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థను నిర్మించినట్టు మన వేదాలు తెలుపుతున్నాయి. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదుగురు ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు. 1. కమ్మరి అయోకారుడు – ఇనుము పని, 2. సూత్రకారుడు (వడ్రంగి) వర్ధకుడు – కొయ్య, కర్ర పని, 3. కాంస్యకారి (కంచరి) తామ్రకారుడు – రాగి, కంచు, ఇత్తడి పని, 4. స్తపతి(శిల్పి) శిల్పకారుడు – రాతిపని, 5. స్వర్ణకారి స్వర్ణకారుడు – బంగారు పని. సకల కళలలో రాణించే ఈ ఐదుగురి సంతానమే నేటి విశ్వకర్మ సామాజికవర్గ ప్రజలు.
నాడు ఆదరణ.. నేడు నిరాదరణ
ఇంతటి గొప్ప చరిత్రక నేపథ్యం కలిగిన విశ్వకర్మ వారసులు, విశ్వబ్రాహ్మణ సామాజికవర్గ ప్రజల సాంకేతిక నైపుణ్యం నేటి ఆధునిక జీవన విధానం మూలంగా ఆదరణకు నోచుకోవడం లేదు. అయితే, నేటి ఆధునిక సాంకేతిక కాలానికి అనుగుణంగా విశ్వబ్రాహ్మణుల నైపుణ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లైతే మన దేశం వివిధ రంగాల్లోని సాంకేతికతతో, సృజనాత్మకతతో మరింత పురోగతి సాధిచవచ్చునని వారి నైపుణ్యాన్ని చూసినవారికి ఇట్టే అర్థమైపోతుంది. కానీ, అవేవీ ప్రస్తుత ప్రభుత్వాలకు పట్టవని అర్థమవుతూనే ఉంది. విశ్వకర్మల నైపుణ్యాలను దేశ పురోగతికి అనుకూలంగా మలచుకోవడం కంటే ఏ ఎండకాగొడుగు అన్నట్టు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికే ఆసక్తి చూపుతున్నాయి మన ప్రభుత్వాలు. అందుకు నిదర్శనమే విశ్వబ్రాహ్మణ సామాజికవర్గ ప్రజల ప్రస్తుత దీన స్థితి అని చెప్పవచ్చు. ఒకప్పటి పల్లెల్లో వడ్రంగి, కమ్మరి కొట్టాలలో రైతుల కళకళలు, శిల్పుల ఇలాకాలో దర్పాలు, స్వర్ణకారుల మర్మభాష ఛలోక్తులు, పెళ్లిళ్ల శోభలు నేడు కరువైనాయి. విశ్వబ్రాహ్మణ చేతి వృత్తులు ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో ఆదరణకు నోచుకోకపోగా వడ్రంగిపై అటవీశాఖ అధికారుల దాడులు, స్వర్ణకారులపై పోలీస్ కేసులతో వేధింపులకు గురవుతున్నాయి.
మారిన సాంకేతిక యాంత్రీకరణ కారణంగా, అలాగే తమ కుల వృత్తులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విశ్వబ్రాహ్మణ సామాజికవర్గ ప్రజలు ఆ వృత్తులను వదిలేసి ఏటీఎంలలో వాచ్ మెన్ లుగా, ప్రైవేట్ కంపెనీ లలో హెల్పర్లుగా జీవనం సాగిస్తూ తమ బ్రతుకులీడుస్తున్న దుర్గతి పట్టింది. బీసీలలో గొల్ల, కురుమ, యాదవ, ముదిరాజు, బెస్త, గౌడ తదితర కులవృత్తుల ప్రజలను ప్రోత్సాహించినంతలో కనీసం 10 శాతం శ్రద్ధాయినా విశ్వబ్రాహ్మణ సామాజికవర్గాన్ని ఉద్ధరించడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదంటే ఆ నిర్లక్ష్యానికి కారకులెవరు? ప్రభుత్వాలా? ప్రభుత్వాలతో తమ హక్కులను సాధించుకోలేని విశ్వబ్రాహ్మణ కుల సంఘాల నాయకులా? అనేది మిలియన్ డాలర్ల సమాధానం లేని ప్రశ్నగా నిలిచింది. నిర్లక్ష్యం ఎవరిదైనా విశ్వ సృష్టికర్తయిన విశ్వకర్మ వారసుల కళలను, నైపుణ్యతను మరుగున పడిపోనీయకుండా ఆ సామాజికవర్గానికి చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. వారి నైపుణ్యాన్ని వ్యాపారాత్మకంగానో, మరో విధంగానో ఉపయోగించుకొని రాష్ట్ర, దేశ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
– శ్రీనివాస్ గుండోజు, ఫోన్: 9985188429