ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సామజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు జీవన విధానాలను, స్థితిగతులను సమస్యలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2009 సం.లో వీరశైవ లింగాయత్ లను, లింగ బలిజలను రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి తరగతులలో చేర్చడం జరిగిందని కానీ 14 సం.లు గడచినప్పటికీ కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చలేదని, కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడం వలన తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో, ప్రభుత్వ పథకాలలో చాలా నష్టం జరుగుతున్న విషయాలను రాష్ట్రరపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇందుకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి శివకుమార్, రాష్ట్ర కోశాధికారి జి.దినేష్ పాటిల్, రాష్ట్ర యువజన అధ్యక్షులు కల్లేపల్లి రాచప్ప, కేంద్ర కమిటీ చైర్మన్ మాజీ ఉప లోకాయుక్త ఎం.శివరత్న, అడ్వైజర్ కల్వ మల్లికార్జునప్ప, సభ్యులు డాక్టర్ కోటి శివప్ప, రాష్ట్ర ప్రతినిధులు కర్నే రాజశేఖర్, ఆవిటి మధుసూదన్, మిరియాల అనిల్ కుమార్, కే.సోమేశ్వర్ లు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి మహాత్మా బసవేశ్వరుని చిత్రపటాన్ని, మహాత్మా బసవేశ్వరాది శివశరణులు బోధించిన ‘వచనము’ అనే పుస్తకాన్ని ఒరియా భాషలో ముద్రితమైన సంపుటిని సవివరంగా వివరించి బహుకరించినట్లు పేర్కొన్నారు.