వైభవంగా తెప్పోత్సవం…పులకించిన గోదావరి

కభద్రాద్రిలో హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు
కదర్శించుకుని తరించిన భక్తులు
కనేటి తెల్లవారుజామున వైకుంఠ ఉత్తరద్వార దర్శనం

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శుక్రవారం నిర్వహించిన తెప్పోత్సవం కార్యక్రమం వైభవంగా  జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సాయంత్రం 4 గంటల సమయంలో వేదమంత్రోత్సవాల మధ్య మేళతాళాలతో, కోలాటాల మధ్య  స్వామి వారిని ఆలయం నుండి ఉత్పవమూర్తులను బయటకు ఊరేగింపుగా తీసుకువొచ్చి పవిత్ర గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న హంసవాహనంపై కూర్చుండ బెట్టారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హంసవాహనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలు అలంకారం గావించారు. అంతేకాకుండా హంసవాహనాన్ని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించారు. అలాగే పూలమాలలతో సుందరంగా అలంకరించిన హంసవాహనంపై శ్రీ సీతారామచంద్రస్వాములను కూర్చుండబెట్టారు. హంసవాహనంపై కూర్చున్న స్వామివారు విద్యుత్‌ దీపాల కాంతులతో భక్తులకు సుందరంగా దర్శనం ఇచ్చారు. గోదావరి నదీ తీరమంతా మామిడి తోరణాలతో కళకళలాడిరది. స్వామివారిని చూసి తరించడానికి అనేక మంది భక్తులు తరలివచ్చారు…దర్శించుకున్నారు.    స్వామివారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అల, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్‌జైన్‌, ఏఎస్‌పి పరితోస్‌ పంకజ్‌, భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్‌ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం వేదమంత్రోత్సరణల మధ్య 6 గంటలకు స్వామివారి హంసవాహనం గోదావరి నదిలో విహరించేందుకు బయలుదేరింది. స్వామివారి హంసవాహనంపై నృత్య ప్రదర్శన జరిగింది. స్వామివారు కూర్చున్న హంసవాహనం ఐదు సార్లు గోదావరిలో ప్రదక్షిణలు చేసింది. స్వామివారి హంసవాహనం ప్రారంభం కావడంతో ముందుగా సిద్ధం చేసిన బాణాసంచాలు ఒక్కసారిగా పేల్చడంతో భక్తుల్లో ఆనందోత్సవాలు వెల్లువిరిసాయి.

జై శ్రీరామ్‌ జై శ్రీరామ్‌ అంటూ భక్తులు నినదించడంతో గోదావరి నదీ తీరం అంతా మారుమ్రోగింది. అంతేకాకుండా వివిధ ఆకారాల్లో తయారు చేసిన బాణాసంచాలు కాల్చడం వలన ఆ సుందర దృష్యాన్ని భక్తులు కనులారా చూసి తరించారు. ఆకాశంలోకి బాణాసంచాలు పంపడంతో కాంతులు విరజిమ్మాయి. ఈ తతంగం సుమారు రెండు గంటలుకు పైగా సాగింది. వొచ్చిన భక్తులు ఎంతో ఓపికతో చూసి తరించారు. 15 రోజుల పాటు తయారు చేసిన హంసవాహనం విజయవంతంగా గోదావరి తీరిలో విహరించింది. హంసవాహనం గోదావరి నదిలో ప్రదక్షిణలు చేసే ప్రాంతం అధికారులు ముందుగా మార్కు చేయడంతో ఆ ప్రాంతంలోనే స్వామివారి వాహనం విహరించింది. ఈ ఉత్సవానికి భారీగా భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించడానికి వొచ్చారు. ప్రముఖులు సైతం స్వామివారిని దర్శించుకున్నారు. వొచ్చిన భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. అధికారులు భద్రాద్రిని సుందరంగా తీర్చిదిద్దారు. పగటిని మైమరపించే విధంగా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసు తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే భక్తులకు అసౌకర్యం కలుగకుండా వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. భక్తుల కోసం వైద్య శిభిరాలను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.

తెల్లవారుజామున వైకుంఠ ఉత్తరద్వార దర్శనం
శనివారం తెల్లవారుజామున ఉత్తర వైకుఠద్వారదర్శనం అత్యంత వైభవంగా జరగనుంది. ఆ సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఆ గడియలు రానే వొచ్చాయి. వైకుంఠరామున్ని చూసేందుకు భద్రాద్రికి భారీగా భక్తులు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసారు. స్వామివారి దర్శనార్ధం భక్తుల కోసం ప్రత్యేక సెక్టార్లను కూడా ఏర్పాటు చేసారు. విఐపిలు వొచ్చినందున వారికి ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page