సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు ఉత్సవాల నిర్వహణ
భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ సంబురాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నది. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.ఈ క్రమంలో నిర్వహణపై బీఆర్కే భవన్లో సమన్వయ సమావేశం జరిగింది. భేటీలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆయాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 3న ట్యాంక్‌బండ్ వద్ద సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. బతుకమ్మ పండుగపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామని డీజీపీ తెలిపారు.