దేశంలో ఆహారధాన్యాల సేకరణ,వ్యవసాయ విధానంలో మార్పులు రానంత వరకు ..వాటి ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉంటాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను బలోపేతం చేయడంతో పాటు, ఆహారధాన్యాల దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే ఎంతగా శ్రమించినా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కార్పోరేట్ దిగ్గజాలకు ఇస్తున్న ప్రాధాన్యం మన దేశంలో రైతులకు ఇవ్వడం లేదు. ఆదానీ, అంబానీలకు మద్దతు ఉన్నంత మాత్రాన దేశం అభివృద్ది చెందదు. సామాన్య రైతులను ఆధారం చేసుకుని మన విధానాలు మార్చుకోవాలి. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు ఎప్పుడూ మోసోపోతూనే ఉన్నారు. ఈ పరిస్థితి మారాల్సి ఉంది. సాగు చట్టాలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించినా..రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకో లేదు. నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలను పైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేయలేదు.
నిజానికి ఈ రెండు రంగాలను బలోపేతం చేస్తే గ్రాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాగలదు. అలాగే దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరగాలి. వ్యవసాయ దిగుమతులను తగ్గించుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. గోదాముల్లో పేరుకు పోతున్న ధాన్యం ప్రజలకు అందడం లేదు. దేశంలో నేటికీ పేదప్రజలు ఆకలితో అలమటిస్తున్న దుర్భర పరిస్థితులు దాపురించాయి. వాళ్ళ దగ్గర కొనుగోలుశక్తి లేకపోవడమే దీనికి కారణం. వీరంతా తమ ఆరోగ్య సంరక్షణకి, గృహ వసతికి, బిడ్డల చదువులకు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. అంటే ఈ రంగాలను కూడా పేదలకు చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థలో వినిమయాన్ని పెంపొందించడం జరగాలంటే ప్రజాసంక్షేమ రంగాల్లో కేటాయింపులను పెంచాలి. దేశంలో ఎఫ్సిఐ వద్ద ఆహార ధాన్యాల నిల్వలు అలాగే పడివున్నాయి. కానీ ప్రజల కొనుగోలుశక్తి లేకపోవడంతో అధిక ధరలు దాడి చేస్తున్నాయి.
నిజానికి సంక్షేమానికి కేటాయింపులు పెంచాలి. కాని బడ్జెట్లో సంక్షేమ రంగాలకు గతంలో ఉన్న కేటాయింపులకు సైతం కోతలు పెట్టింది. తలసరి వాస్తవ వినిమయంలో పెరుగుదల 5శాతం కన్నా తక్కువగానే ఉంది. ఇది జిడిపి వృద్ధి రేటు కన్నా తక్కువ. ఉపాధి హా పథకానికి కేటాయింపులను రూ.60వేల కోట్లకు తగ్గించడం ద్వారా గ్రామాల్లో పనులను నియంత్రించబోతున్నారు. దీంతో ప్రజలకు ద్రవ్యవినిమయం కాకుండా పోతున్నది. దశాబ్దం క్రితం ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పథకానికి కేటాయించినది రూ.1,12,000 కోట్లు! దీనిని బట్టి ఈ పథకాన్నే మొత్తంగా ఎత్తేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్పష్టం ఔతోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలో 81 కోట్లమందికి నెలకు 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వం చాలా గొప్పగా ప్రచారం చేసుకుం టోంది. కాని గత బడ్జెట్తో పోల్చితే ఈ సారి ఆహార సబ్సిడీకి కేటాయింపుల్లో 31 శాతం తగ్గించారు. అలా తగ్గించినదాంట్లో 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించడం అంటే తక్కిన పేదలకు అందాల్సిన ఆహార సబ్సిడీలో మరింత ఎక్కువగా కోత పెట్టడమే కాగలదు. విద్య, వైద్యం రంగాలకు కేటాయింపుల్లో నామమాత్రపు పెరుగుదల చూపించారు. కాని పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఫలితంగా ఈ రంగాలు వాస్తవం గా గతం కన్నా తక్కువ కేటాయింపులనే పొంద నున్నాయి.
ఉత్పత్తి సామర్ద్యాన్ని పూర్తిగా ఉపయో గించుకోవడం కాని, మౌలిక వసతులను సంపూర్ణంగా ఉపయోగించుకో గలగడం కాని జరగడం లేదు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం లేదు. పైగా దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడ కూడా ప్రమాదంలో పడిపో తుంది. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడనంత కాలం ఆర్థిక వ్యవస్త చితికి పోతూనే ఉంటుంది. ప్రజల కొనుగోలుశక్తి పెరగనంత కాలం ఈ పరిస్థితి తప్పదు. అప్పుడు ఈ ఆర్థికవృద్ధి లక్ష్యానికే అర్ధం లేకుండా పోతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపుల్లో కోత పడిందో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాసంక్షేమం విషయంలో వెనకాడతాయి. ఆర్థిక వసరులను ఈ విధంగా కావాలనే కేంద్రం చేతుల్లో మరింత ఎక్కువగా ఉంచుకోవడం ద్వారా ఫెడరల్ వ్యవస్థను కేంద్రం మరింత బలహీనపరుస్తోంది. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం వలన నేరుగా శ్రామిక ప్రజలు లబ్ది పొందుతారు. ప్రజా సంక్షేమానికి చేసే ఖర్చు ఆర్థిక వ్యవస్థ ద చేసిన ఖర్చుకి మించి కొన్ని రెట్టు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అదే పెట్టుబడి వ్యయం ద ఖర్చు చేస్తే ఆ విధమైన ప్రభావం ఉండదు. అంటే పెట్టుబడి వ్యయం ద ఖర్చు పెంచడం కన్నా సంక్షేమం ద ఖర్చు పెంచితే ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఎక్కువ ఉపాధి కల్పన జరుగుతుంది.
పెట్టుబడి వ్యయం కోసం కేటాయించిన దాంట్లో ఎక్కువభాగం యంత్రాల, టెక్నాలజీల కొనుగోళ్ళ కోసం విదేశాలకు తరలిపోతుంది. ఆ మేరకు ఉపాధి కల్పన జరగకుండా పోతోంది. అందుచేత పెట్టుబడి వ్యయాన్ని పెంచినంత మాత్రాన దేశంలో ఉపాధి కల్పన జరిగిపోతుందని అనుకోరాదు. దేశీయంగా ఆ పెట్టుబడి వ్యయాన్ని వినియోగించగలిగిన పరిస్థితి ఉంటే మనదేశంలో ఉపాధి కల్పన పెరుగుతుంది. అంతేకాని విదేశీ దిగుమతులకోసం పెట్టుబడి వ్యయాన్ని ఎక్కువ కేటాయిస్తే ఉపాధి అదనంగా పెరిగేది చాలా స్వల్పమే. నిజంగా ఉపాధి కల్పనను పెంచాలని అనుకుంటే విదేశీ దిగుమతుల నుండి దేశీయ ఉత్పత్తులకు మరింత ఎక్కువ రక్షణ కల్పించాలి. బడ్జెట్లో పెట్టుబడి వ్యయాన్ని బాగా పెంచినందువలన దిగుమతులు పెరుగుతాయి. దాని ఫలితంగా విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు మరింత పెరుగుతుంది. మన రూపాయి విలువను ఎంత తగ్గించినా, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మాంద్యం కారణంగా ఎగుమతులలో వృద్ధి లేదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా కార్యాచరణ జరగాలి. గ్రామాల్లో ఆర్థిక కార్యకాలపాలకు ప్రాధాన్యం పెరగాలి. అలా జరగాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాలను ఆదుకోవాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్