వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు
ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు
చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి

పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.  నిజానికి దేశం ఇప్పుడు అనేకానేక సమస్యలు ఎదుర్కొంటోంది. గత పదేళ్లుగా మసిపూసి మారేడుగాయ చేశారు. రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతోంది. దేశంలో ఆర్థిక దుస్థితిని పరిశీలించి అడ్డుకట్ట వేసే చర్యలు కానరావడం లేదు. ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబానికి నెలకు 50వేలు లేనిదే పూట గడవలేని దుస్థితి నెలకొంది. జిఎస్టీలు తగ్గించడం, ఇన్‌కమ్‌ టాక్స్‌ పరిమితి పెంచడం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడం వంటి అత్యవసర చర్యలపై కేంద్ర,రాష్టాల్రు దృష్టి సారించడం లేదు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసే చర్యలపై మోదీ  ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. కార్పోరేట్లకు అండగా నిలవడం తప్ప ప్రజలకు అండగా ఉండే చర్యలు కానరావడం లేదు.

ప్రజలను కష్టాల కొలిమిలోంచి బయటపడేసే చర్యలు కానరావడం లేదు. పేదలు మరింత పేదలుగా మారారు. అలాగే మధ్య తరగతి ప్రజలు మరింతగా దెబ్బతిన్నారు. కాయకష్టం చేసుకునే వారికి ఢోకా లేకున్నా ఉపాధి, ఉద్యోగ రంగాలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. దెబ్బతిన్న రంగాలను గుర్తించి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. ప్రధానంగా లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ వాళ్లు బాగా దెబ్బతిన్నారు. ఉద్యోగాలు పోయాయి. ఉపాధి దొరకడం లేదు. ఈ వర్గాలను గుర్తించి వారిని నేరుగా ఆదుకునే చర్యలకు ఉపక్రమించాలి. గతంలో ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ ఎవరికి మేలు చేసిందో తెలియదు. సర్వే జరిపించి ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన వారిని గుర్తించి వారికి చేయూతను అందించాలి. అలాగే బ్యాంకులు ఉదారంగా తక్కు వడ్డీలకు రుణాలు ఇచ్చేలా చూడాలి. చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారికి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వగలగాలి. అప్పుడే గ్రావిరీణ ఆర్థికరంగం బలోపేతం అవుతుంది.

అసత్యాలు, అర్థసత్యాలతో ఎప్పటికప్పుడు నెట్టుకురావడం కాక, ప్రజల మనసుల్లో రక్షకులుగా చిరస్థాయిగా నిలిచి పోయేందుకు పాలకులు కృషి చేయాలి. అలాగే ఆర్థికంగా అతిపెద్ద చర్యలకు ఉపక్రమించాలి. ప్రధానంగా ఉపాధిరంగాలను విపరీతంగా ప్రోత్సహించాలి. ప్రజలకు అవసరమైతే వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. చిన్నాచితకా వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనంత వరకు దేశ అర్థికస్థితి కుదుట పడదని గుర్తించాలి. ఇవన్నీ కూడా చర్చించడానికి వేదిక లేదు. మోదీ  ఏకీకృత సామ్రాజ్యం నిర్మించు కోవడంతో ఆ కోటలోకి ప్రవేశించే ఆస్కారం లేకుండా పోయింది. అందువల్ల ఈ సమస్యలను కేవలం పార్లమెంటులోనే చర్చించేలా విపక్షం పక్కాగా వ్యూహం పన్నాలి. అప్పుడే పార్లమెంటులో ప్రజల సమస్యలు చర్చకు వస్తాయి. అందుకు అనుగుణంగా విపక్షం నడుచుకోవాలి. పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్దతులకు దూరంగా ఉంటేనే మేలు.  పార్లమెంటులో ప్రజల సమస్యలపై చర్చ సాగాల్సిందే.

చర్చకు విపక్షాలు పట్టుబట్టాల్సిందే. చర్చలకు ప్రభుత్వం సహేతుకంగా సమాధానం ఇవ్వాల్సిందే. ఇటీవల నీట్‌ పరీక్షలపై దుమారం చెలరేగింది. పేపర్‌ లీకేజీ వ్యవహారం చూస్తుంటే ఇదంతా కొందరు ఆడిన డ్రామాగా కనిపిస్తోంది. లక్షలాదిమంది విద్యార్థులను మోసం చేసి..కొందరు తమ స్వార్థం కోసం పేపర్‌ లీక్‌ చేశారని అర్థం అయ్యింది. దీనిపై చర్చించాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ పట్టుబట్టారు. ఆయన పట్టుబట్టడం..వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడం జరిగింది. పార్లమెంట్‌ వాయిదా పడడంతో ఒకరోజు పార్లమెంట్‌ వృధా అయ్యింది. ప్రధాన ప్రతిపక్షం సమస్యలను ప్రస్తావించే క్రమంలో రూల్‌ పొజిషన్‌ కూడా స్టడీ చేయాలి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదించడం అవసరం. దీనిపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో నీట్‌పైనా చర్చించే అవకాశం ఉంటుంది. విపక్షం ఈ సందర్బంగా నీట్‌ అంశాన్ని ఉపయోగించుకుని ఉండాల్సింది. కానీ చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్‌ స్తంభించిందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఈ సమస్య ఆ ఒక్కరోజుతోనే ముగిసింది. కానీ చర్చ సాగివుంటే నిజాలు బయటకు వచ్చేవి.                                ి

-కందుల శ్రీనివాస్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
సెల్‌: 98484 43599

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page