వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు

ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే రాజీనామా అంటూ డ్రామాలకు తెరలేపారు. ఎన్ని మార్గదర్శకాలు పెట్టి ఫిల్టర్‌ చేసినా సరే అమలు అసాధ్యమని అనుకున్నారు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ హయాంలో రూ. లక్ష రుణమాఫీ చేయడానికి కేసీఆర్‌ ఐదేళ్లు తంటాలు పడ్డారు. అయినా పూర్తిగా రుణమాఫీ చేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్‌ వల్ల కానిది రేవంత్‌రెడ్డి వల్ల అవుతుందా.. అన్న లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ అమలు ప్రకటన రావడంతో ఆ ఇద్దరు ఆందోళన చెందారు. అందుకే కొత్త రాగాలతో విమర్శలకు దిగుతున్నారు. మార్గదర్శకాలు సరిగా లేవని, అందరు రైతులకు అందడం లేదని, ఇంకా పలు కారణాలతో తమ సహజసిద్దమైన ధోరణిలో విమర్శలను సంధించారు. ఒక మంచిపని చేస్తుంటే అభినందించాలి.

లోటుపాట్లు ఉంటే చర్చించాలి. సహేతుకమైన సలహాలు ఇవ్వాలి. కానీ విపక్షమంటే విమర్శించడం అన్న పద్దతిలో బిఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిస్తున్నారు. అయినా రేవంత్‌ రెడ్డి మాత్రం.. రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోపు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిధులు లభ్యం కావడంతో ముందుగానే లక్ష రుణమాఫీ చేసేశారు. రైతుల ఖాతాల్లో రూ. లక్ష వరకూ జమ అయ్యాయి. నెలాఖరున లక్షన్నర లోపు.. వచ్చే ఆగస్టు పదిహేనులోపు రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని ప్రకటించారు. గతంలో రుణమాఫీని ఎప్పుడు, ఎలా చేస్తారో చెప్పలేని వారు ఇప్పుడు విమర్శలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిధుల సమీకరణపై స్పష్టమైన లక్ష్యంతో ఉండటంతో పూర్తి చేయడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. రెండు లక్షలు అంటే చిన్న మొత్తం కాదు. రైతు కుటుంబాలకు ఎన్నో సమస్యల పరిష్కారం చేస్తాయి. ఈ నిర్ణయంతో రేవంత్‌ రెడ్డి ఇమేజ్‌ ఆమాంతం పెరిగిందనే చెప్పాలి. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకున్నప్పటికీ.. ఆ కుటుంబాల ప్రాతిపదికగా రేషన్‌ కార్డునే చూస్తున్నారు.

ఈ కారణంగా ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్దిదారులు అయ్యే అవకాశం ఉండదు. చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ మెజార్టీ రైతుల్లో .. రైతు కుటుంబాల్లో రేవంత్‌ రెడ్డికి సానుకూలత పెరుగుతుందని చెప్పాలి. సీఎంగా బాద్యతలు చేపట్టిన తర్వాత మూడు నెలల పాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో రేవంత్‌ ఏవిరీ చేయలేకపోయారు. మిగిలిన నాలుగు నెలల సమయంలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. ఆర్థిక పరమైన సమస్యను సులువుగానే అధిగమిస్తున్నారు. కానీ ఆయన ఉద్యోగాల భర్తీ, పరీక్షల విషయంతో పాటు శాంతిభద్రతలు..ఇతర విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరీక్షలను వాయిదా వేయాలని పట్టుబడుతున్న విద్యార్థుల డిమాండ్‌ వెనక ఎవరు న్నారన్నది అందరికీ తెలిసిందే.

మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న నగదుతో పాటు మరికొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. రుణమాఫీ చేయలేని బీఆర్‌ఎస్‌, బీజేపీ చెబుతూ వచ్చాయి. ఇప్పుడు అర్హుల్ని తగ్గించేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ధనవంతులకు రుణమాఫీ చేయకపో యినా వచ్చే వ్యతిరేకత ఏమీ ఉండదు. కానీ.. అర్హులైన వారికి అన్యాయం జరగనివ్వబోమని కాంగ్రెస్‌ సర్కార్‌ చెబుతోంది. మొత్తంగా అనేక సమస్యల మధ్య రేవంత్‌ రెడ్డి వ్యూహాత్మకంగా రుణమాఫీ అమలుతో సమర్థత చాటుకున్నారు. అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలకు ముందస్తు ప్రణాళికతో నిధులు సమకూరుస్తోంది. రైతుల రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరం ఉందని అంచనా ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పక్కా ప్రణాళికలతో ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకున్న ఘనత దక్కించుకుంది.
-వడ్డె మారెన్న
సెల్‌: 9000345368

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page