వరదలకు వేలాది ఎకరాలు మునక
ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు
వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : పది రోజులుగా వరద ముంపులోనే ఉన్న ఇళ్ళు ఇప్పుడిప్పుడే వరదనీటి నుండి బయటపడుతున్నాయి. గోదావరి కొంత శాంతించింది. గురువారం సాయంత్రానికి 45 అడుగులు తగ్గుముఖం పట్టింది. దీని కారణంగా కొన్నికాలనీలు వరదముంపు తగ్గడంతో పారిశుధ్య సిబ్బంది ఆ ఇండ్లను శుభ్రం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా బ్లీచింగ్ చల్లుతున్నారు. ఎటువంటి అంటువ్యాధులు రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈవరదలకు భదాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 79 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. 1,54,065 కుటుంబాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. వీరిని పునరావాస కేంద్రంలో ఉంచి అధికారులు ఎప్పటికప్పుడు ఆహార పదార్ధాలు అందచేస్తున్నారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా 99 గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగాయి. 5047 మంది రైతులు ఉన్నారు. 10831 ఎకరాలు నష్టం వాటిల్లింది. ఎకరానికి 54వేలు రూపాయలు అంచనా వేసినట్లు తెలిపారు. మొత్తం 58,488 నష్టం జరిగినట్లు చెప్పారు.బూర్గంపాడు , చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో ప్రత్తి 7,417 ఎకరాలు, వరి 3,305 ఎకరాలు, పచ్చిమిర్చి 7 ఎకరాలు , దించ 102 ఎకరాలు నష్టం వాటిల్లింది. అధికారులు ఇంకా నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో పాటు సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సేవలు అందిస్తున్నారు.
పునరావాస కేంద్రాల్లోనే వరదబాధితులు
కొన్నికాలనీలు ఇంకా పునరావాస కేంద్రంలోనే ఉన్నాయి. వరద ప్రభావం తగ్గినప్పటికి ఇండ్లలో గోడలు తడిచి తేమ ఉండటంతో బాధితులు ఇండ్లలోకి భయపడుతున్నారు. విద్యుత్ సౌకర్యం కూడ ఇంకా కొన్ని ఇండ్లకు కల్పించకపోవడం వలన పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. పంచాయితీ అధికారులు యుద్దప్రాతికన పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నారు.