శ్రామికవర్గాల భద్రతే ఆరోగ్య, అభివృద్ధికి దారులు..

(04 – 10 మార్చి ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు/దినోత్సవాలు’’ సందర్భంగా…)

‘జీవితం అమూల్యమైంది, అనుక్షణం భద్రతా స్ప్రహను కలిగి ఉందాం’ అనే నినాదాన్ని నిత్యం మననం చేసుకుంటూ సురక్ష కవచాలు ధరించి జీవనయానం చేద్దాం. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, పరిశ్రమల్లో విషవాయువులు లీక్‌ కావడం, రైలు పట్టాలు తప్పడం, విమానాలు కుప్పకూలడం, బస్సు ప్రమాదాలు ఎదురుకావడం లాంటివి భద్రత లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. రోడ్డు ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, విమానయానాలు, పని క్షేత్రంలో జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ చర్యలు, పర్యావరణ పరిరక్షణ అడుగులు లాంటి సందర్భాల్లో భద్రతా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల, యాజమాన్యాల కనీస బాధ్యత. ఇసుమంత నిర్లక్ష్యం లేదా అశ్రద్ధ కూడా ప్రాణాపాయం ముంగిట నిలుపుతుందని గత అనుభవాలు తెలుపుతున్నాయి.

భారత జాతీయ భద్రత మండలి వ్యవస్థాపక దినం (04 image.png
మార్చి): మానవ జీవన విలువలు తెలుసుకుంటూ భద్రత చర్యలు తీసుకోవలసినే కనీస అవగాహనలను కలిగించుటకు ప్రతి ఏట 04 మార్చి రోజున దేశవ్యాప్తంగా ‘‘జాతీయ భద్రతా దినం(నేషనల్‌ సేఫ్టీ డే)’’ నిర్వహించుటతో పాటు మార్చి 04 – 10 వరకు ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు (నేషనల్‌ సేఫ్టీ వీక్‌)’’ పాటించుట ఆనవాయితీగా మారింది. రోడ్డు, కార్యాలయ, పని క్షేత్రాల్లో భద్రత అవసరాన్ని సామాన్య జనులకు వివరించడానికి జాతీయ భద్రతా దినోత్సవం/వారోత్సవాలు నిర్వహించుట అనివార్యమైంది. భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ 04 మార్చి 1966న ఏర్పాటైన ‘భారత జాతీయ భద్రతా మండలి (నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా)’ సందర్భానికి గుర్తుగా 1972 నుంచి ప్రతి ఏట 04 మార్చిన జాతీయ భద్రత దినం పాటించుట జరుగుతోంది.

జాతీయ భద్రతా దినం-2024 నినాదం:  జాతీయ భద్రతా దినం-2024 నినాదంగా ‘‘రోడ్డు భద్రతా హీరో కావాలి (బి ఏ రోడ్‌ సేఫ్టీ హీరో)’’ అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతున్నది. జాతీయ భద్రత దినం/వారం వేదికగా గత ఏడాదిగా భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ (సేఫ్టీ, హెల్త్‌, ఎన్విరాన్‌మెంట్‌ ొ యస్‌హెచ్‌ఈ) ఉద్యమాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా విస్తరించిన పరిశ్రమల్లో కార్మికుల సురక్ష, కంపెనీల్లో ఉద్యోగుల ఆరోగ్యకర వాతావరణం, ప్రయాణ వ్యవస్థల్లో యాజమాన్యాల భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేయుటకు ప్రభుత్వాలు, యాజమాన్యాలు, ఉద్యోగులు నడుం బిగించాలి.

భద్రత పట్ల పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సంపూర్ణ అవగాహన, భద్రత సంస్కృతిని పెంపొందించుట సమాజంలోని విజ్ఞుల కనీస బాధ్యత అని మరువరాదు. భద్రత ప్రాధాన్యతతో పాటు సేఫ్టీ ప్రోటోకాల్స్‌ పట్ల విద్యార్థులకు పలు రకాలైన పోటీలు, నిపుణులతో ఉపన్యాసాలు, సదస్సులు, చర్చలు, నినాదాలు, కరపత్రాలు, అత్యవసర భద్రత డ్రిల్స్‌, రేడియో/టీవీ/ప్రింట్‌/సోషల్‌ మీడియా కార్యక్రమాలు లాంటివి నిర్వహించుట సముచితంగా ఉంటుంది. భద్రత చర్యల్లో అలసత్వం ప్రాణాంతమని, స్వల్ప చర్యలు సకల జనులకు సంక్షేమదాయకమని గుర్తుంచుకోవాలి. భద్రతా లోపాల ఫలితంగా జరిగిన దుర్ఘటనలు మనకు గుణపాఠం కావాలి, సురక్ష ప్రాముఖ్యతను గుర్తు చేయాలి. సురక్షిత జీవితాలకు వ్యక్తిగత/వ్యవస్థాగత/ప్రభుత్వాలు చురుకైన పాత్రలను పోషించాలి. తెలుసుకోవడం కనీస బాధ్యతని, అజ్ఞానం క్షంతవ్యం కాదని తెలుసుకుందాం.

-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
 కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page