- గేట్లు మూసేసిన అధికారులు
- పలు మండలాల్లో తీవ్రంగా పంటలు నష్టం
- కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద
నిజామాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. ఇన్ ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. 9 గేట్ల ద్వారా దిగువకు 81,434 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1,01,760 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087.9 అడుగులుగా ఉంది. జూన్ 1 నుండి ప్రాజెక్టులోకి 139 టీఎంసీల వరద వచ్చిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకి కూడా వరద తగ్గుముఖం పడుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 679.500 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 12354 క్యూసెక్కులు ఉంటే ఔట్ ఫ్లో 16815 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి 16 గేట్లను అధికారులు తెరిచి నీటిని కిందకు వదిలారు. జూన్ 1 నుండి ఇప్పటివరకు 83 టీఎంసీల నీటిని దిగువ గోదావరిలోకి వొదిలారు. 2006 తర్వాత వచ్చిన అతిపెద్ద వరదగా భావిస్తున్న గోదావరి ఉధృతి శుక్రవారం రాత్రి 70.7 అడుగులకు చేరుకుంది.
మరో 0.3 అడుగు మేర పెరిగి , తగ్గుముఖం పడుతుందన్న సీడబ్ల్యూసీ ఆఫీసర్ల నివేదికతో మన్యం కుదుటపడింది. ఎగువన వాజేడు, వెంకటాపురం, మేడిగడ్డల వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో ఆఫీసర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్టను తాకుతూ ప్రవహిస్తుండడం, మట్టికట్ట ఇరవై ఏండ్ల కిందిది కావడంతో కలెక్టర్ కట్ట ప్రాంతాల్లో ఉండే వారిని స్వయంగా ఖాళీ చేయించారు. ఇకపోతే భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో 59,342 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి, సోయా, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు నీటి పాలయ్యాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. రెంజల్, నవీపేట, నందిపేట మండలాల్లో పంట నష్టం జరిగింది. ఆర్మూర్, బాల్కొండ, మెండోరా మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ వద్ద వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14,46,500 క్యూసెక్కులుగా ఉంది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,41,891 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.