సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరిందనేది వివరించడమే కాకుండా ప్రతిపక్షాల ఆరోపణలు, విష ప్రచారాలు, విమర్శలను తిప్పికొట్టాలని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా ముందుకు సాగాలని ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్ నందు హస్తినపురం డివిజన్ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అభివృద్ధి విషయంలో ఎల్.బి.నగర్ ముందంజలో ఉందని, వచ్చే ఎన్నికల్లో ఎల్.బి.నగర్ నందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నందు పలు కమిటీ పదవులు ఉన్న ప్రతి ఒక్కరు మన నియోజకవర్గ పరిధిలోని జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ పరిధిలో  వేల కోట్ల రూపాయలతో స్కై, ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసినట్టు తెలిపారు. అలాగే నియోజకవర్గ పరిధిలో అత్యధిక పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ మన నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. జీ.ఓ 11 ద్వారా పండ్ల మార్కెట్ ను కోహెడకు తరలించి ఆ ప్రాంతంలో టీమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగిందని, 118 జీ.ఓ.ద్వారా 18 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చడం జరిగిందని తెలిపారు. ఆటో నగర్ డంపింగ్ యార్డు స్థలం కోర్టు కేసు ఉండడం వల్ల ఆలస్యం జరిగిందని, కొన్ని రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయి తిరిగి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. హస్తినపురం నందు రిజిస్ట్రేషన్ సమస్యల వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాను చొరవ తీసుకుని రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఎస్.ఎన్.డి.పీ. పనుల వల్ల ఇప్పుడు మనం ప్రతిఫలం అనుభవిస్తున్నామని, ఎస్.ఎన్.డి.పీ.,  ఎస్.ఆర్.డి.పీ. పనులు వేగవంతం చేసి, ఎంత పెద్ద భారీ వర్షం వచ్చిన ఇండ్లు మునగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇంకా కొన్నిచోట్ల చిన్న, చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో బి.ఎన్.రెడ్డి.నగర్, చంపాపేట్, నాగోల్ నందు ఫ్లై ఓవర్లు వేయిస్తామని తెలిపారు. ఇప్పుడు  నియోజకవర్గం మీద ఏమి అవగాహన లేని కొత్త, కొత్త నాయకులు రాజకీయ లబ్ది పొందాలని కొత్త కొత్త వరసలు కలుపుకుంటు వచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ గల్లీ ఎక్కడ ఉందో తెలియని నాయకులను నమ్మవద్దని, నియోజకవర్గం మీద అవగాహన లేని వ్యక్తి ఏమి అభివృద్ధి చేస్తాడని అన్నారు. మా ఊరు, మా ఊరు అంటూ కొత్త వరసలు కలుపుతున్న నాయకులు వరదలు, కరోన సమయంలో ఎక్కడికి పోయారని  ప్రశ్నించారు. ఎల్లప్పుడూ ప్రజలకు తాను అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. కావున రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందించలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు సత్యం చారి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్, పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page