భూ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
ముంబై, జూన్ 28 : శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే ఆయనకు ఈడీ రెండోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. ప్రవీణ రౌత్, పత్రా చావల్ ల్యాండ్ స్కామ్ కేసులో సంజయ్ మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కానీ ఏజెన్సీ ముందు హాజరు కావడానికి తనకు మరికొంత సమయం ఇవ్వాలని సంజయ్ ఈడీని కోరారు.
ఈ క్రమంలో జులై 1న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశిస్తూ కొత్తగా మళ్లీ సమన్లు జారీ చేసింది. నగదు అక్రమ చలామణి వ్యవహారం కేసులో ప్రశ్నిస్తామని, అందుకోసం తమ ఎదుట హాజరు కావాలని రౌత్‌కు జారీ చేసిన సమన్లలో ఈడీ పేర్కొంది. కాగా రూ.1,034 కోట్ల విలువైన పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఏప్రిల్ నెలలో జప్తు చేసింది.