సారవంతమైన నేలల్ని ఎడారులుగా మార్చవద్దు..!

నేడు ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక దినం’

1960ల్లో నార్మన్‌ ‌బోర్లాగ్‌ ‌నాయకత్వంలో వచ్చిన హరిత విప్లవంతో వరి, గోధుమ లాంటి పొట్టి పంటలను ఏళ్ల తరబడి సాగుచేయడంతో నేలలు నిస్సారమై ఎడారీకరణకు బీజాలు పడ్డాయి. సహజ విపత్తులు లేదా మానవ కృత్రిమ కార్యాల వల్ల సారవంతమైన నేల నిర్వీర్యం, నిస్సారం కావడాన్ని ఎడారీకరణగా పేర్కొంటారు. 1970ల్లో వచ్చిన స్వల్పకాలిక వరి వంగడాల సాగుతో దిగుబడులు పెరిగినా, నాణానికి మరో వైపులా సారవంతమైన వ్యవసాయ నేలలు క్రమంగా నిస్సారమైన ఎడారులుగా మారే ప్రమాదపు అంచున ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూపీ, పంజాబ్‌, ‌బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌లాంటి గంగా పరివాహక ప్రాంతాల్లో 5 మిలియన్‌ ‌హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాలు ఎడారీకరణకు చేరువలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అవగాహన లేమి, అశాస్త్రీయ సాగు పద్దతులతో సారవంతమైన నేలల్ని నిస్సారమైన ఎడారి భూములుగా మార్చుటతో కరువుకాటకాలు పెరుగుతున్నాయని గమనించిన ఐరాస ప్రతి ఏటా 17 జూన్‌న ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక పోరు దినం’ పాటించట జరుగుతున్నది.

ఎడారీకరణ ముంగిట్లో మానవాళి:
భూగోళంపై ఉన్న నేలలో 40 శాతం వరకు నీటి వసతులు లేని బీడు భూములే (డ్రై లాండ్స్) ఉన్నాయని, ఈ భూముల్లో 2 బిలియన్ల ప్రజలు జీవిస్తున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్‌ ‌ఘనపు కిలోమీటర్ల శుష్క భూములు (అరీడ్‌ ‌లాండ్స్) ఎడారీకరణకు లోనైనాయని, దాదాపు 20 శాతం బీడు భూములు క్షీణత(డీగ్రెడేషన్‌)‌కు గురి అయ్యాయని గణాంకాలు వివరిస్తున్నాయి. భూగోళంపై ఉన్న 20 శాతం నేలల్లో సగం వరకు ఎడారీకరణ ప్రమాదపు అంచున ఉన్నాయని, ప్రతి ఏటా 12 మిలియన్‌ ‌హెక్టార్ల సారవంతమైన నేల ఎడారీకరణ ఉచ్చులో పడుతున్నదని తేలింది. ఈ అవాంఛనీయ సంక్షోభ ఫలితంగా 3 బిలియన్ల ప్రజలు ఆహార కొరతతో పేదరికంలోకి నెట్టబడడం జరుగుతున్నది. ఈ దుష్పరిణామాల వల్ల ఒక బిలియన్‌ ‌ప్రజల ఆకలి చావులు పెరుగుతాయని పేర్కొనబడింది.

సత్వరమే మానవ సమాజం మేల్కొని ఎడారీకరణకు అడ్డుకట్టవేయని యెడల రాబోయే 25 ఏండ్లలో 12 శాతం ఆహార ఉత్పత్తి పడిపోయి, 30 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం, పేదరికం పెరగడం జరిగి, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధిగమించడం వీలుకాని దుస్థితి వస్తుందని గమనించాలి. 2030 వరకు 350 మిలియన్‌ ‌హెక్టార్ల నిస్సార ఎడారి భూముల నాణ్యతను పునర్‌ ‌ప్రతిష్టాపన చేయడంతో దాదాపు 26 గీగా టన్నుల గ్రీన్‌హౌజ్‌ ‌వాయువులు వాతావరణలోంచి తొలగించబడుతాయని అంచనా వేస్తున్నారు. ఎడారీరకణను కట్టడి చేయడంతో వ్యవసాయం, వ్యవసాయ ఆధార ఉపాధులు, అనుబంధ పరిశ్రమలు, పోషకాహార లభ్యత, నీటి లభ్యత, జీవ వైవిధ్య పరిరక్షణ పెరిగి వాతావరణంలో సకారాత్మక మార్పులకు పుణాది పడుతుంది.

ఎడారీకరణకు కారణాలు:
ఈ నేలలకు పోషకాలను అందిస్తూ, వెంటనే సారాన్ని అందించని యెడల వ్యవసాయ యోగ్యతను కోల్పోయి, వ్యవసాయ వినియోగానికి పనికి రాకుండా శుష్క భూములుగా మారిపోతాయని గమనించాలి. సకాలంలో స్పందించని యెడల కొంత కాలానికి నేల నాణ్యత క్షీణించి, క్రమంగా వ్యవసాయ దిగుబడులు పూర్తిగా తగ్గి, శాశ్వితంగా కోలుకోలేని దుస్థితికి చేరుతూ ఎడారులను తలపిస్తాయి. నేలను అత్యాశతో సాగుకు వాడితే పర్యావరణ కాలుష్యం, వాతావరణ ప్రతికూల మార్పులు, జీవ వైవిధ్య వినాశనం, అంటువ్యాధులు ప్రబలడం జరుగుతాయి. దీని పర్యవసానంగా నీటి కొరత, జీవన భృతి కోల్పోవడం, ప్రకృతి విపత్తులు కూడా జరగవచ్చు.

కృత్రిమ ఎరువులు అధికంగా వాడడం , విచక్షణారహిత రసాయనాల వాడకం, అధిక నీటి వినియోగంతో దిగుబడులు పెరిగి ఆహార భద్రత సుసాధ్యమైనప్పటికీ ఏకకాలంలో ఎడారీకరణ కూడా పెరగడం విచారకరం. నేలలోని సారాన్ని అనేక ఏండ్లుగా దురాశతో వాడుతూ, దిగుబడులను పెంచుకునే ప్రయత్నాలలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడంతో నేలలోని హిత సూక్ష్మజీవులు, ఇతర జీవులు నశించడంతో సారవంతమైన నేలలు క్రమంగా నిస్సారమై ఎడారీకరణకు చేరువ కావడం చూస్తుండగానే జరిగిపోయింది. నేల ఎడారీకరణ, నేల కోత, నేల నాణ్యతలో క్షీణతలు కాలక్రమంలో జరగడం వాస్తవ అనుభవంగా గుర్తిస్తున్నాం. అడవుల నరికి వేత, పచ్చిక బయళ్లు / చెట్టు చేమల్ని తొలగించడం, పశుగ్రాస వినియోగం, వ్యవసాయ క్షేత్రాల విస్తరణ, రోడ్ల నిర్మాణం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ లాంటి మానవ ఆధునిక క్రియలు ఎడారీకరణను అనేక రెట్లు పెంచడం జరిగింది. అత్యాధునిక యంత్రాల వినియోగం, ఒకే రకమైన పంటలు వేయడం, నేల నాణ్యతను అతిగా పీల్చడం, నేల కాలుష్యం లాంటి కారణాలతో నాణ్యమైన నేలలు నిస్సారమై ఎడారులను తలపించుట ప్రారంభమైంది.

ఎడారీకరణ కట్టడి మార్గాలు:
ఆహార వ్యర్థాలను తగ్గించడంతో పాటు పంట మార్పిడి పద్దతులు, పరిమిత పట్టణీకరణ, విచక్షణాయుత ఎరువులు/ పురుగు మందులు వాడకం లాంటి అనేక చర్యలు ఎడారీకరణను అడ్డుకుంటాయి. సారవంతమైన నేలలు మానవాళి ఉనికికి ప్రతిరూపాలని తెలుసుకొంటూ, గ్రీన్‌హౌజ్‌ ‌వాయువులను నియంత్రిణ చేయడమే కాకుండా మ్నెక్కలు, జంతువులు, మానవాళిని సుసంపన్నం చేయడానికి ఎడారీకరణకు ఆనకట్ట వేయబడుతుంది. మానవ కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడులను అందించుటలో సారవంతమైన నేలలు ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయని, నేల సారాన్ని కాపాడడమంటే జీవన ప్రమాణాలను పెంచుకోవడమే అని భావిద్దాం. నాణ్యమైన మట్టి సువాసనను ఆశ్నివాదిస్తూ, పిడికిళ్లోకి తీసుకొని ముద్దాడుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page